తెలంగాణ రాష్ట్ర సమితిలో నయా జోష్ కనిపిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందిన తర్వాత, మునుగోడులో జరిగిన తొలి ఎన్నికలో ఘన విజయం సాధించిన గులాబీ పార్టీ.. జాతీయ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. సరికొత్త ఉద్యమ పంథాతో దశాబ్దాల కలను సాకారం చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గులాబీ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనతో ప్రజల మనస్సులు గెలుచుకున్నది. బీజేపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న జనం.. ఉద్యమ పార్టీకి కొండంత అండగా ఉంటున్నారు. ఎన్నిక ఏదైనా ఏకపక్ష విజయాలను కట్టబెడుతున్నారు. ప్రజల మద్దతుతో ‘కారు’ దూసుకెళ్తున్నది. ఢిల్లీ పీఠం వైపు వేగంగా సాగిపోతున్నది.
నిజామాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి తిరుగులేని శక్తిగా అవతరించింది. స్వరాష్ర్టాన్ని సాధించిన పార్టీకి తప్ప మిగిలిన వారికి చోటు లేదని తాజాగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాలతో తేటతెల్లమైంది. అనేక కుట్రలతో ఉపఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించాలని భా వించిన బీజేపీకి మునుగోడు ప్రజలు సరైన రీతిలో జవాబునిచ్చారు. బైపోల్లో టీ(బీ)ఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం చరిత్ర పుటల్లో నిలువబోతున్నదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అరంగేట్రం చేస్తున్న వేళ ఈ ఫలితం మరింత ఉత్సాహాన్ని నింపుతున్నది. ఓ వైపు గులాబీ వర్గాల్లో మునుగోడు జోష్ కనిపిస్తుండగా శ్రేణుల్లోనూ రెట్టింపు ఆనందం వ్యక్తం అవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తుగా ఓడిపోవడంతో వాటికి తెలంగాణ రాష్ట్రంలో మనుగడే లేదని స్పష్టమైంది. ఎన్ని కుట్రలు చేసినా చివరికి ప్రజల మద్దతు, ఆశీస్సులు ముమ్మాటికి కేసీఆర్ పార్టీకే దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీగా మారబోతున్న వేళ మునుగోడు ఫలితం టీ(బీ)ఆర్ఎస్ వర్గాల్లో బలమైన శక్తిని అందించినట్లు అయ్యిందని గులాబీ నేతలు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో విషం…
సామాజిక మాధ్యమాలనే ప్రధాన వనరుగా మా ర్చుకున్న భారతీయ జనతా పార్టీ సిగ్గు లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. మునుగోడులో ఘోరంగా ఓటమి చెందినప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా టీ(బీ)ఆర్ఎస్ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నాలకు ఒడిగడుతున్నది. ఇందులో భాగంగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి వాటిని సోషల్ మీడియాలో నకిలీ పత్రిక కథనాలుగా మార్ఫింగ్ చేసి పోస్టులు వైరల్ చేస్తున్నారు.
ఈ వ్యవహారం సోమవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో వెలుగు చూసింది. స్థానిక టీ(బీ)ఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల జోక్యంతో అవాస్తవ పోస్టులను వైరల్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా ఇతరత్రా గ్రూపుల్లోనూ బీజేపీకి చెందిన నాయకులే వ్యాప్తి చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ కుట్రపై సమగ్ర దర్యాప్తు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. మునుగోడులో ప్రజాస్వామ్య బద్ధంగా ఓటర్ల మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచినప్పటికీ బీజేపీ జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా నకిలీ వార్తలను వైరల్ చేస్తూ పైశాచికత్వాన్ని పొందుతుండడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నకిలీ వార్తల వ్యవహారం వెనుక బీజేపీకి చెందిన ముఖ్య నాయకుల హస్తం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
చప్పుడు చేయని బీజేపీ ఎంపీ…
మునుగోడు ఉప ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ రంకెలు వేశాడు. నోటికొచ్చినట్లు అబద్ధాలతో ప్రచారం చేశాడు. 2019 ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్ ఏకంగా మునుగోడులో ఓట్లడుగుతూ కనిపించడంపై సోషల్ మీడియాలో సర్వత్రా సెటైర్లు వెలువడ్డాయి. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకురాని వ్యక్తి నీతులు వల్లించడం ఏంటంటూ ప్ర శ్నించారు.
ఇష్టమొచ్చినట్లుగా మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయగా అర్వింద్ ఆటలేవీ మునుగోడులో చెల్లినట్లు కనిపించడం లేదు. ఉప ఎన్నికల్లో టీ(బీ)ఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో బీజేపీ ఎంపీ అడ్రస్ మాయమైంది. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నిజామాబాద్ ఎంపీ పత్తా లేడంటూ సోషల్ మీడియాలో టీఆర్ఎస్ శ్రేణులు ఆడుకుంటున్నారు. మునుగోడు ఎన్నికల్లో అన్నీతానై వ్యవహరించినట్లుగా బిల్డప్ ఇచ్చిన అర్వింద్ ముఖం చెల్లుబాటు కాకపోవడంతో ఆయన అనుచరులు నిజామాబాద్లో నైరాశ్యంలో మునిగిపోయారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్లోనూ ము నుగోడు తరహా ఫలితమే ఏర్పడుతుందని లోలోపల భయాందోళనకు గురవుతున్నారు.
సత్తా చాటనున్న బీ(టీ)ఆర్ఎస్…
భారత్ రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసిన మరుసటి రోజు నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి నూతన ప్రస్థానాన్ని లిఖించనున్నది. టీఆర్ఎస్గా ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని ఆక్రమించిన గులాబీ పార్టీ ఇక బీఆర్ఎస్ రూపంలోనూ ప్రజల ముంగిట నిలువనున్నది. జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన చేసిన అనతి కాలంలోనే టీ(బీ)ఆర్ఎస్కు అద్భుతమైన ప్రజల మద్దతు దక్కడంతో ఇదే ఉత్సాహంతో మున్ముందు జరిగే ఎన్నికల రణరంగంలోనూ గులాబీ పార్టీ సత్తా చాటడం ఖాయంగా మారింది.
ఇందుకు గత చరి త్ర అంతా ఇదే చెబుతున్నది. 2001, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తొలి నాళ్లలో ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి యావత్ ఉమ్మడి రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. అచ్చంగా ఇదే తీరులో మునుగోడు ఫలితం కూడా భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావానికి ముందే శుభ సూచకంగా నిలువనున్నదని గులాబీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.