తాడ్వాయి, నవంబర్ 8: ఆరోగ్యాన్ని ప్రసాదించే పాలకు డిమాండ్ పెరిగింది. దీంతో రైతులు వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తిపై ఆసక్తి కనబరుస్తున్నారు. పాడి పరిశ్రమ ద్వారా అదనపు ఆదాయం సమకూరడంతో ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. పశుసంపదను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తులను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు విజయ డెయిరీ రైతులను ప్రోత్సహిస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని రైతులు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడేవారు.
కాలువలు, చెరువులు లేకపోవడంతో వర్షాధార పంటలే సాగు చేస్తారు. అదనపు ఆదాయం కోసం క్రమంగా పాడి పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దాదాపు ప్రతిరైతూ నేడు పాడి పశువులను పెంచుతున్నాడు. దీంతో జిల్లాలోనే ఎక్కడా లేనివిధంగా తాడ్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో విజయ పాల ఉత్పత్తిదారుల కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సేకరించిన పాలను కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శీతలీకరణ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు విక్రయానికి తీసుకెళ్తారు.
రాయితీపై జీవాలు..
పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆసక్తి ఉన్న రైతులకు రాయితీపై ఆవులు, బర్రెలను పంపిణీ చేస్తున్నది. రుణాలు సైతం అందజేస్తున్నది. వీటితోపాటు ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి జీవాల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ అండతో పాడి పరిశ్రమపై దృష్టిపెట్టిన రైతు కుటుంబాలు నేడు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తున్నాయి.
మినీ బీఎంసీలు..
మండలంలో పాల ఉత్పత్తి పెరగడంతో తాడ్వాయి, ఎర్రాపహాడ్ గ్రామాల్లో ప్రభుత్వం మినీ (బల్క్ మిల్క్ కూలింగ్) బీఎంసీలను ఏర్పాటు చేసింది. ఎర్రాపహాడ్ బీఎంసీ పరిధిలోని 9, తాడ్వాయి పరిధిలో 9 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రైతుల నుంచి సేకరించిన పాలను ఆటోల ద్వారా బీఎంసీ కేంద్రాలకు తరలిస్తారు. ఎర్రాపహాడ్ బీఎంసీ పరిధిలో 3,500 లీటర్లు, తాడ్వాయి నుంచి 1800 లీటర్ల పాలను కూలింగ్ చేసి హైదరాబాద్‌కు పంపిస్తున్నట్లు విజయ డెయిరీ అధికారులు తెలిపారు. గేదెపాలు లీటరుకు 4.90 పైసలు, ఆవు పాలపై రూ.4 పెంచడంతో పాడి రైతులు సంతోషిస్తున్నారు.
కొద్దిగా కష్టపడితే మంచి లాభాలు
పాలకు మార్కెట్లో మం చి డిమాండ్ ఉన్నది. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపై దృష్టి పెట్టి కొద్దిగా కష్టపడితే మంచి లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వం లీటర్‌కు పాల ధరను ఆరు నెలలకోసారి పెంచి మరింత ప్రోత్సహించాలి. రాయితీలను కొనసాగిస్తూ కొత్తగా రుణాలు ఇవ్వాలి.
-శ్రీధర్‌రావు, రైతు, బ్రాహ్మణపల్లి
పాల ఉత్పత్తిని పెంచుతున్నాం..
వ్యవసాయంపైనే ఆధారపడే రైతులను ప్రోత్సహించి పాడి పరిశ్రమ వైపు దృష్టిపెట్టేలా చూస్తున్నాం. విస్తృతంగా అవగాహన కల్పిస్తూ పాల ఉత్పత్తిని పెంచుతున్నాం. ఏపూటకాపూట పాలను సేకరిస్తున్నాం. కూలింగ్ చేసిన పాలను హైదరాబాద్‌కు పంపిస్తాం. పాలుపోసే రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తాం. 15 రోజులకోసారి డబ్బులను నేరుగా లేదంటే బ్యాంక్ అకౌంట్లో జమచేస్తాం.