బాన్సువాడ టౌన్, నవంబర్ 8 : ప్రభుత్వ దవాఖానలు దేవాలయాలని, వైద్యం అందించే వైద్యులు దేవుళ్లతో సమానమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కితాబిచ్చారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఆయన పర్యటించారు. మొదటగా పట్టణంలోని వంద పడకల మాతాశిశు దవాఖానను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. వైద్యుల పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వచ్చిన వైద్యులతో సమీక్షించారు.
కామారెడ్డి, ఆర్మూర్ నుంచి వచ్చి సేవలు అందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దవాఖానలో ఇంకా వైద్యుల కొరత ఉందని ఈ విషయమై ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రికి విన్నవించానని తెలిపారు. దీంతో గైనకాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ వైద్యులను ఇతర దవాఖానల నుంచి భర్తీ చేశారని అన్నారు.
సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ బాన్సువాడ వాసి అని, దవాఖాన నిర్వహణలో సంపూర్ణమైన పాత్ర వహిస్తున్నారని అన్నారు. దవాఖానలో క్యాంటీన్ , షెడ్డు, డైనింగ్ షెడ్డు కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న రెవెన్యూ సమీకృత భవనాల నిర్మాణం కోసం స్థలం పరిశీలించి కొలతలు చేయించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, నార్ల ఉదయ్ గుప్తా, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రవితేజ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ వినయ్‌కుమార్, డాక్టర్ దినేశ్ రంజన్, వైద్య సిబ్బంది , నాయకులు ఉన్నారు.