నిజామాబాద్ క్రైం, నవంబర్ 8 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల క్రితం తెల్లవారు జామున జరిగిన వరుస దొంగతనాల సంఘటనపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 4వ తేదీన కొన్ని గంటల వ్యవధిలోనే ఎనిమిది దుకాణాల షట్టర్స్ ధ్వంసం చేసి నగదుతో పాటు ఇతర వస్తువులు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్లను సైతం దుండగులు ఎత్తుకుపోయిన సంగతి విదితమే. ముందుగా డిచ్పల్లి మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో ఒక షాపులో దొంగతనానికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్ నగరంలో ఎనిమిది దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు.
సీసీ కెమెరాలకు చిక్కిన దుండగుల చిత్రాలు
గుర్తు పట్టకుండా దొంగలు ముసుగులు ధరించి వ చ్చినట్లు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా స్పష్టం అవుతుం ది. అంతే కాకుండా దుండగులు తమకు సంబంధించి వేలి ముద్రలతో పాటు ఇతర ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు వహించారు. చేతులకు గ్లౌవ్స్ ధరించి ఉండడం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
ప్రొఫెషనల్ దొంగలుగా గుర్తింపు
ఎనిమిది దుకాణాలను కొల్లగట్టిన వారిని ప్రొఫెషనల్ దొంగలుగా పోలీసులు నిర్ధారించారు. అయి తే అదే కోణంలో వారు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగలు ఒకే బైక్పై వచ్చినట్లు జిల్లా కేంద్రలోని కొన్ని ఏరియాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ వెంకటేశ్వర్ పర్యవేక్షణలో సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్ ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు సందీప్, లింబాద్రి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులు పోలీసులు పడిన శ్రమ ఫలించినట్లు తెలిసింది. వరుస దొంగతనాలకు పాల్పడిన దుండగులను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో ఈ చోరీలకు సంబంధించిన కేసు కొలిక్కి రానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.