బాన్సువాడ, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి విజ యం సాధించారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగిన మందల గూడెం, చిన్న కొండూర్ ఎంపీటీసీ పరిధిలో మొదటి రౌండ్లోనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 642 మెజారిటీ సాధించారు. నెల రోజులుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ డీసీసీబీ చైర్మన్ తన అనుచరులు, స్థానిక నాయకులు, సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్ ఇన్చార్జిగా వ్యవహరించిన చౌటుప్పల్ మండలంలో మొదటి రౌండ్లోనే ప్రభాకర్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. బీజేపీ కంచు కోట అయిన చౌటుప్పల్ రూరల్ మండలంలో పార్టీని బలపరిచారు. బాన్సువాడ నియోజక వర్గ నాయకులతో పాటు చౌటుప్పల్ మండలంలోని ఆయా గ్రామాల నాయకులతో ఆయన పర్యటన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి దోహదపడింది.
ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
నెల రోజుల పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ చేసిన కఠోర శ్రమకు ఫలితంగా చిన్న కొండూరు ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు 642 ఓట్ల మెజారిటీ వచ్చిందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వ్యక్తిగతంగా కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని తెలిపారు. ప్రచార బాధ్యతల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.