ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతున్నది. బాలికల సంఖ్య తగ్గిపోతున్నది. స్త్రీ, పురుష నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నది. గత నెలలో విడుదలైన బాలికల జననాల రేటును పరిశీలిస్తే విస్మయానికి గురి చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఆడపిల్లల పుట్టుక తగ్గిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే బాగానే ఉన్నప్పటికీ, జిల్లాల వారీగా పరిశీలిస్తే మాత్రం కామారెడ్డిలో దయనీయ పరిస్థితి నెలకొన్నది. జాతీయ సగటు ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు 919 మంది బాలికలు ఉంటే, నిజామాబాద్లో అంతకు మించి (1000/984) ఉండడం విశేషం.
అదే కామారెడ్డి జిల్లాలో మాత్రం జాతీయ సగటు కన్నా 32 శాతం తక్కువగా (1000/887) బాలికల జననాల రేటు నమోదవుతుండడం విస్తుగొలుపుతున్నది. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు గర్భ విచ్ఛిత్తి చేయిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు, ఇష్టానుసారంగా గర్భస్రావాలు చేస్తుండడం కూడా ఆడబిడ్డల ఉనికికి ప్రమాదకరంగా పరిణమించింది. ‘ఆమె’ లేకుంటే సృష్టి లేదు. అందుకే ఇక నుంచైనా ప్రజల ఆలోచన ధోరణి మారాలి. బాలికలు బతకాలి.. బంగారు తల్లులను బతికించాలి.
నిజామాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో బాలికల జనానాల రేటుపై మిశ్రమ ఫలితాలు వెల్లడయ్యాయి. గత నెలలో విడుదలైన బాలికల జననాల రేటులో నిజామాబాద్ మెరుగైన ఫలితాలను కనబర్చగా, కామారెడ్డి జిల్లా దుస్థితిని మూట కట్టుకుంటోంది. జాతీయ సగటుతో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో నమోదైన జననాల రేటు కాసింత మెరుగ్గానే ఉన్నప్పటికీ కొత్త జిల్లాల పరంగా పరిశీలిస్తే మాత్రం కామారెడ్డిలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
2016లో నూతన జిల్లాల పునర్విభజనకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాలో వెయ్యి మంది బాలలకు బాలికల జననాల రేటు వెయ్యి దాటేది. దీంతో దేశంలోనే ముందు వరుసలో నిలుస్తూ వచ్చిన నిజామాబాద్ ఇప్పుడు కాస్త వెనుకబడగా..నిర్మల్ జిల్లా తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇక కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా బాలికల జననాల రేటు నమోదు కావడం గమనార్హం.ఇందుకు ఆడ పిల్లలపై కొనసాగుతున్న వివక్షనే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. లింగ నిర్ధారణ యథేచ్ఛగా జరగడంతోపాటు ఇష్టానుసారంగా అబార్షన్లు కూడా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణమని తెలుస్తోంది. జాతీయ సగటున 919 నిష్పత్తితో పోలిస్తే నిజామాబాద్లో 984 కాగా, కామారెడ్డిలో 887 ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఆధునిక యుగంలో విద్యావకాశాలు మెరుగుపడడంతో ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు వస్తోంది. ఆడ పిల్ల పుడితే బాధపడే రోజులు కనుమరుగవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు బాలికల జననాల రేటు 952 ఉంటే ఇందులో నిజామాబాద్ జిల్లా రేటు 984గా ఉంది. కామారెడ్డిలో 887 మాత్రమే ఉండడం గమనార్హం. జాతీయ సగటుతో పోల్చినప్పుడు నిజామాబాద్లో మెరుగైన ఫలితాలుండగా కామారెడ్డిలో ఇందుకు భిన్నంగా ఉంది.
జనాభా పరంగా చూసినా, అక్షరాస్యత పరంగా చూసినా మహిళల సంఖ్య తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. అయినా పదేండ్ల గణాంకాలు చూస్తే మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో స్త్రీ, పురుష నిష్పత్తిలో 1044తో నిజామాబాద్ జిల్లా టాప్లో ఉండేది. లింగ వివక్ష కారణంగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.
వివిధ కార్యక్రమాలతో కాస్త మెరుగుపడుతున్నా కామారెడ్డిలో ఇంకా ఈ వివక్ష ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ ఆరోగ్య సర్వేలో 2019-20లో ఇది 870 గా ఉండడం గమనార్హం. 2020-21 నివేదికలో బాలికల జననాల రేటులో నిజామాబాద్లో 1000 మంది బాలురకు 984 మంది బాలికలు పుట్టారు. జాతీయ సగటు 919 కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సగటు 952 గా ఉంది. వీటి కన్నా ఫర్వాలేదు అన్నట్లుగా నిజామాబాద్ పరిస్థితి ఉంది. కామారెడ్డిలో 887కే పరిమితం కావడం ఆందోళనకరంగా మారింది.
జాతీయ స్థాయిలో ఆడ పిల్లల రక్షణ, సాధికారతతో పాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినప్పటికీ ఎక్కడా సత్ఫలితాలు రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా పిలుపునిచ్చిన నినాదం కేవలం గోడలకే పరిమితమవుతున్నది. మారుతున్న సమాజంలో చాలా మంది తల్లిదండ్రుల్లో ఆలోచన ధోరణి మారుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడంలో విఫలమవుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆడ బిడ్డలు పుట్టిన ఇంటికి ప్రోత్సాహాలు అందిస్తూ వివక్షను రూపుమాపుతున్నారు. అంతే కాకుండా విద్యావకాశాలను భారీగా కల్పించారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రులకు భారం అన్నది లేకుండా చేస్తున్నారు.
పెండ్లీడుకు వచ్చిన ఆడ పిల్లల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను (రూ.లక్షా 116) అందించి కొండంత అండగా నిలుస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడిపిల్లలకు రక్షణ అన్నది లభిస్తోంది. భారీ డాంబికాలు పలికే బీజేపీ మాత్రం నినాదాలతో ప్రజలను మాయమాటలతో పక్కదారి పట్టిస్తూ నిత్యం మోసం చేస్తోంది.
ఆడపిల్ల అని తెలిస్తే పురిట్లోనే వదిలించుకోవడం, బలవంతంగా అబార్షన్లు చేయించుకోవడమే ప్రధానంగా బాలికల జననాల రేటు పడిపోవడానికి కారణం. ఈ పరిస్థితి తండాలు, మారుమూల గ్రామాల్లో ఎక్కువగా ఉంటోంది. ఆడ పిల్లల జనన రేటు పడిపోవడానికి మరో కారణం ఉందన్న అభిప్రాయం ఉంది. అబార్షన్లు చేసే దవాఖానలు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇంకా కొనసాగుతున్నాయని, తరచూ ఆరోపణలు వస్తున్నా వైద్యారోగ్య శాఖ తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కామారెడ్డిలో ఆడ పిల్లల సంఖ్య మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది.
స్కానింగ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున లింగ నిర్ధారణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నిబంధనలు పాటించని కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానల్లో కాన్పు జరిగి బిడ్డ పుడితే ఆ వివరాలు పురపాలిక, గ్రామ పంచాయతీ అధికారులకు అందించాలన్న నిబంధన కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా అమలుకావడంలేదు. దీంతో ఆడ శిశువుల విక్రయాలు, పుట్టిన తర్వాత హత మార్చడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఎప్పుడైనా ముళ్ల పొదలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఆడ శిశువులను వదిలి వెళ్తే శిశు గృహకు తరలించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారు. ఎందుకు వదిలి వెళ్లారు. వారికి ఏ దవాఖాన సిబ్బంది సహకారం అందించారు? అనే విషయాలపై సమగ్ర విచారణ చేపట్టకపోవడం లోటుపాట్లకు ఊతం ఇస్తోంది.