రెంజల్, నవంబర్ 3: మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ లోలపు రజిని అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పల్లెల్లో గృహ వినియోగదారులకు ప్రతి నెలా విద్యుత్తు బిల్లులు తీయాలని, జీపీల బకాయి బిల్లుల్లో మినహాయింపు ఇవ్వాలని, నిలిచిన ఎన్ఎస్ఎఫ్ భూముల రిజిష్టర్ చేయాలని, నీలాలో పశువైద్య ఉప కేంద్రంలో పని చేసే జేవీవో భీంరావు రైతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, తక్షణమే బదిలీ చేయాలని సభ్యులు ఎకగ్రీవ తీర్మానం చేసినట్లు ఎంపీపీ తెలిపారు.
లైన్మన్లో స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించక పోవడంతో ప్రతి పనికీ తామే సమాదానం చెప్పాల్సి వస్తున్నదని సర్పంచులు ఇన్ చార్జి ఏఈ రాజలింగంకు ఫిర్యాదు చేశారు. రెంజల్ పీహెచ్సీలో కుక్క, పాము కాటుకు ఇంజక్షన్‌లో అందుబాటులో ఉందని హెచ్‌ఈవో వివరించారు. ఖాళీగా ఉన్న మండల వైద్యాధికారులను వెంటనే భర్తీ చేసేలా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారికి నివేదిస్తామని ఎంపీడీవో శంకర్ సమాదానం చెప్పారు.
బోర్గాం హెచ్ఎం హన్మంత్‌రావు ప్రవర్తన బాగా లేదని, ఎంఈవో పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తే వారి ప్రవర్తనలో మార్పు వస్తుందని ప్రజాప్రతినిధులు కోరారు. శనగ, పొగాకు విత్తేతందుకు గాను వారం రోజులు అదనంగా రాత్రి సమయంలో విద్యుత్తు సరఫరా చేయాలని నీలా విండో చైర్మన్ ఇమ్రాన్బేగ్ ఇన్చార్జి ఏఈకి కోరారు. సమావేశంలో తహసీల్దార్ రాంచందర్, వైస్ ఎంపీపీ యోగేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.