రామారెడ్డి, అక్టోబర్ 3 : కామారెడ్డి జిల్లా రామారెడ్డి తహసీల్ కార్యాలయంలో పట్టాలో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేసిన ఇన్చార్జి తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఏసీబీ వలకు చిక్కారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నారం గ్రామానికి చెందిన మండ్ల బలరామ్ పెద్దమ్మ దన్నెపు రాజవ్వ రెండు సంవత్సరాల క్రితం మరణించింది.
ఆమెకు వారసులు లేకపోవడంతో పెద్దమ్మ పేరు మీద ఉన్న 37 గుంటల భూమిని తన పేరుపైన చేయాలని పలుమార్లు తహసీల్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. దీంతో ఇన్చార్జి తహసీల్దార్ మానస ఎంక్వైరీ చేసి చేస్తామని.. ఆన్లైన్ ఫీజు రూ.3000, మరో రూ. 5000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బలరామ్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ధరణి ఆపరేటర్ లక్ష్మణ్‌ను కలవడంతో చివరకు రూ.4,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన బలరామ్ నిజామాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం గురువారం ఆపరేటర్ లక్ష్మణ్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇన్చార్జి తహసీల్దార్ మానస, కంప్యూటర్ ఆపరేటర్ లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నామని, పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.