నిజామాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. జలవనరులు పుష్కలంగా ఉండడం, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో అంచనాలకు మించి పంటలు సాగవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాధారణ విస్తీర్ణం 3లక్షల 87వేల ఎకరాలు కాగా గత ఏడాది 4లక్షల 71వేల 542 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దాదాపు లక్ష ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ లెక్కల ప్రకారం యాసంగి 2022-23లో వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలను రూపొందించారు. 4 లక్షల 96వేల 279 ఎకరాల్లో పంటలు వేస్తారని నివేదికలను సిద్ధం చేశారు. ఇందులో వరి పంట గతేడాది 3లక్షల 46వేల 672 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 3లక్షల 67వేల 739 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. వరితో పాటు రైతులు ఇతర పంటల సాగుపైనా దృష్టి సారించారు. అవసరం మేరకు ఎరువులు, విత్తనాలను సైతం వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది.
యాసంగి సీజన్ అంటేనే గతమంతా కన్నీళ్ల పర్యంతం. సమయానికి కరెంట్ రాక, అందుబాటులో విత్తనాలు, ఎరువులు లేక అన్నదాతలు పడిన గోస అంతా ఇంతా కాదు. అప్పో సొప్పో చేసి సాగుకు ముందడుగు వేస్తే సరిపడా నీళ్లు అందేవి కాదు. భూగర్భ జలాలు ఇంకి బోర్లలో నీరు వచ్చేది కాదు. సాగు కాలువల్లో చుక్క నీరు కనిపించక రైతుల్లో భయాందోళనలే వెంటాడేవి. మరోవైపు సాగుకు కరెంట్ కటకట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేది. రాత్రి పూట పొలాల వెంట పరుగులు తీసి పాము కాటుకు, విద్యుత్ తీగల బారిన పడి మృత్యువాత పడిన వారు ఎంతో మంది. యాసంగి సీజన్ ముగిసిన తర్వాత చేతికి పెట్టుబడి పైసల్ కూడా రాకపోగా అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకునేది. ఇలాంటి దుస్థితి నుంచి సుభిక్షమైన వ్యవసాయంలోకి రైతు లు అడుగు పెట్టారు. కేసీఆర్ పాలనలో అందుతున్న ప్రోత్సాహంతో ధైర్యంగా ముందడుగు వేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. గతంలో ఆదుకునే వారు లేక, పెట్టుబడికి పైసల్లేక ఆగమైన రైతులే యాసంగిలో సాగుకు సిద్ధమవుతుండడం ద్వారా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడం ఈ భారీ మార్పునకు చిహ్నాంగా నిలుస్తున్నది.
5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం…
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 29 మండలాల్లో రెండు అర్బన్ మండలాలను మినహాయిస్తే మిగిలిన 27 మండలాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు సాగుకు నోచుకుంటున్నాయి. వాస్తవానికి జిల్లా సాధారణ సగటు 3లక్షల 87వేల ఎకరాలు కాగా గతేడాది 4లక్షల 71వేల 542 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే దాదాపు లక్ష ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ లెక్కల ప్రకారం యాసంగి 2022-23లో వ్యవసాయ శాఖ అంచనాలు భారీగా నమో దు చేసింది. 4 లక్షల 96వేల 279 ఎకరాల్లో పంటలు వేస్తారని నివేదికలను రూపొందించారు. ఇందులో వరి పంట గతేడాది 3లక్షల 46వేల 672 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 3లక్షల 67వేల 739 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. నువ్వులు గతేడాది 14,979 ఎకరాల్లో సాగు కాగా ఈసారి 11,450 ఎకరాల్లో సాగవుతుందని అంచనాలు రూపొందించారు. 1,812 ఎకరాల్లో గతేడాది జొన్న సాగుకు నోచుకోగా ఈసారి 666 ఎకరాలకే పరిమితం అవుతుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. గతేడాది 1,047 ఎకరాల్లో సాగైన ఆవాలు 1,552 ఎకరాలకు పెరగవచ్చని చెబుతున్నారు. సజ్జ గతేడాది 7,187 ఎకరాల్లో సాగవ్వగా ఈసారి దాదాపు రెట్టింపు స్థాయికి అంటే 12 వేల 344 ఎకరాల్లో సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇతర పంటలకూ డిమాండ్…
యాసంగిలో ఇతర పంటల సాగుకు పెద్ద పీట దక్కబోతున్నది. మూస పద్ధతిని వదిలి చాలా మంది రైతులు కొంత కాలంగా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అపరాల సాగుతో పాటు వాణిజ్య పంటలకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నా రు. ఈ సీజన్లో విత్తన జొన్న 39,702 ఎకరాల్లో సాగవ్వగా 40వేల ఎకరాల్లో అంచనాలు రూపొందించారు. శనగ గతేడాది 23వేల 840 ఎకరాల్లో సాగవ్వగా ఈసారి 23,297 ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనాలు చెబుతున్నాయి. మక్కజొన్న గతేడాది 12,493 ఎకరాల్లో ఉండగా ఈసారి 19వేల 745 ఎకరాలకు పెరగవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. పొద్దు తిరుగుడు 16,124 ఎకరాల నుంచి 15వేల 89 ఎకరాలకు, పొగాకు 1130 ఎకరాల నుంచి 1105 ఎకరాలకు చేరుతుందని అంచనాలను సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగానే విత్తనాలకు సంబంధించిన ప్రణాళికను సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇం దులో వరి విత్తనాలను 1.10లక్షల క్వింటాళ్లు, మక్కజొన్న 1,579, శనగ 5,824, పెసర 4.56, మినుము 41.52, సజ్జ 493.76, నువ్వులు 229, పొద్దు తిరుగుడు 301.78, విత్తన జొన్న వేయి క్వింటాళ్ల మేర ఉన్నాయి. యూరియా 96వేల 651 మెట్రిక్ టన్నులు, డీఏపీ 26వేల 167 మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 12వేల 262 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 37వేల 427 మెట్రిక్ టన్నులు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 1377 మెట్రిక్ టన్నులు మేర అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ చెబుతున్నది.
ఎంత మార్పు…
వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకు వచ్చిన సంస్కరణలతో భారీ మార్పులు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇంచు భూమి కూడా పడావు లేకుండా సాగు బాటలో పయనిస్తున్నాయి. 2014కు మునుపు నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల్లో వ్యవసాయ భూములు ఖాళీగా వదిలేసేది. ఒక్కోసారి వానలు సరిగా లేక, భారీ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అందుబాటులో ఉండక పంటలు వేయడానికి రైతులు ముఖం చాటేశారు. మొగులు వైపు చూస్తూ వానాకాలాన్ని గడిపేది. ఇప్పుడంతా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయానికి విభజనకు గురైన నిజామాబాద్ కొత్త జిల్లా ప్రకా రం కేవలం 3లక్షల్లోపు ఎకరాల్లోనే పంటలు సాగైనట్లుగా రికార్డులు చెబుతుండగా ఇప్పుడదీ సరాసరి రెట్టింపునకు చేరింది.
2022-23 యాసంగిలో 4.96లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనాలు సిద్ధం అవుతున్నాయంటే ఈ భారీ మార్పును గమనించవచ్చు. యాసంగి సీజన్ ప్రారంభం నేపథ్యంలో రైతుబంధు నగదును సైతం సమయానికి రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
యాసంగి పంటలకు ఢోకా లేదు…
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తీయడంతో జలకళను సంతరించుకుకున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపుతో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది.
–గొడిసెల నర్సింలు గౌడ్, రైతు, నస్రుల్లాబాద్
గతంలో యాసంగిలో పంట వేసేవాడిని కాదు..
గతంలో వర్షాకాలంలో పది ఎకరాల్లో పంటలు సాగు చేసేవాళ్లం. కరెంటు లేక చెరువుల్లో నీళ్లు లేక యాసంగిలో పంటలకు దూరంగా ఉండేది. రాష్ట్రం ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంటు, విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూడడంతో ఇప్పుడు రెండు పంటలను పండిస్తున్నా.
–షేక్ మోసిన్, రైతు నస్రుల్లాబాద్