నిజామాబాద్ క్రైం, నవంబర్ 1 : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో మంగళవారం అన్నదమ్ములు ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం సృష్టిచింది. తమకు జరిగిన అన్యాయంపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని రెండు కుటుంబాల వారు కలిసి కమిషనర్‌కు తమ గోడు వినిపించుకునేందుకు వచ్చారు. బాధితులు సీపీని కలవక ముందే తమ వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటిచుకునే యత్నం చేయడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది వెంటనే వారిని అడ్డుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని ఇక్కడే తమ ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల పరిధిలోని సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన కురుమ కులస్తులైన హన్మాండ్లు, లింగం ఇద్దరు అన్నదమ్ములు. వీరు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరికి చెందిన రెండు ఎకరాల భూమి విషయంలో కురుమ కులస్తులతో గొడవ జరిగింది. దీంతో రెండు సంవత్సరాల క్రితం ఇరు కుటుంబాలను కుల బహ్కిరణ చేసినట్లు బాధితులు వాపోయారు. ప్రత్యర్థుల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారి వేధింపులు తాళలేక పొరుగున ఉన్న లక్కంపల్లికి వెళ్లి అక్కడే బతుకుతున్నామని తెలిపారు. తమ తండ్రి భూమి వారు అమ్ముకోవడమే కాకుండా తాము కొనుగోలు చేసిన భూమిని కూడా ఇవ్వమంటూ వేధిస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా తమను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. ఈ రోజు ఉదయం సైతం వారు తమ ఇంటిపై దాడి చేసి, తమను చితకబాదారని రోదించారు.
విచారణ చేసి చర్యలు తీసుకోండి : సీపీ ఆదేశం
అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం సంఘటనపై పోలీస్ కమిషనర్ నాగరాజు సీరియస్‌గా పరిగణించారు. బాధితుల సమస్యను తెలుసుకున్న ఆయన వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్‌కు సూచించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఏసీపీ వారిని దర్యాప్తు నిమిత్తం నందిపేట్ ఎస్సై వద్దకు పంపించారు.