మాక్లూర్, అక్టోబర్ 31: ప్రభుత్వ పాఠశాలలంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. అరకొర వసతులు..ఆడుకోవడానికి ఆటస్థలాలు లేక క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో నైపుణ్యం గల కోచ్‌లను నియమించడంతో క్రీడాకారుల ప్రతిభ బయటికి వస్తుంది. చదువుతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుండడంతో విద్యార్థులు ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ఉదాహరణే నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యార్థులు. కేజీబీవీలో చదువుతున్న నిఖిత, హర్షిత, జ్యోతికలు అథ్లెటిక్స్‌లో రాణిస్తూ ప్రతిభ చాటుతున్నారు. జిల్లాస్థాయి పోటీల్లో రాణించి గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించడంతోపాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
జాతీయస్థాయిలో రాణిస్తా..
చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. నేను చదువుకునే పాఠశాలలో మిగతా క్రీడాకారులను చూసి రన్నింగ్, ఇతర అథ్లెటిక్స్‌పై మక్కువ ఏర్పడింది. మా కోచ్ సంధ్య మేడం నాలోని ప్రతిభను గుర్తించి మంచి శిక్షణ ఇవ్వడంతో కొద్దికాలంలోనే పట్టు సాధించాను. నిజామాబాద్‌లో జరిగిన అండర్-14 విభాగంలో పాల్గొని 600 మీటర్ల రన్నింగ్ పోటీలో సిల్వర్ మెడల్, 60 మీటర్ల రన్నింగ్‌లో ప్రథమ స్థానంతో గోల్డ్‌మెడల్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. జాతీయ స్థాయిలో రాణంచాలన్నదే నా ఆశయం.
– నిఖిత, 9వ తరగతి, కేజీబీవీ
కేజీబీవీకి వచ్చిన తర్వాతే..
మా పాఠశాలలో క్రీడల్లో పాల్గొనే వారిని చూసి నాకు ఆసక్తి పెరిగింది. మా కోచ్ నా ఇష్టాన్ని గమనించి షాట్‌పుట్, లాంగ్‌జంప్‌లో మెళకువలు నేర్పించింది. 2022లో జరిగిన జిల్లాస్థాయి అండర్-14 విభాగం లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీల్లో పాల్గొన్నాను. షాట్‌పుట్‌లో బంగారు పతకం, లాంగ్‌జంప్‌లో వెండి పతకం సాధించాను. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాను.
– హర్షిత, 9వ తరగతి, కేజీబీవీ
ఆసక్తి పెరిగింది..
జిల్లాస్థాయి 300 మీటర్ల రన్నిం గ్ అండర్-16విభాగంలో బంగారు పతకం, 100 మీటర్స్‌లో వెండి పత కం సాధించాను. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాలన్నదే నా ధ్యేయం. కేజీబీవీలో ఆడేవారిని చూసి ఆటలపై ఆసక్తి పెరిగింది. ఇక్కడి పీఈటీ మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు.
– జ్యోతిక, 9వ తరగతి, కేజీబీవీ
క్రీడాకారులకు మంచి భవిష్యత్తు..
క్రీడల్లో రాణించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడినవారికి ప్రత్యేక కోటాల్లో అవకాశాలుంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ చక్కని ప్రోత్సాహకాలను అందజేస్తున్నది. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో గ్రామీణా క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతాయి.
– సంధ్య, పీఈటీ