కమ్మర్పల్లి, అక్టోబర్ 30 : సాగు నీటిని అందిస్తూ బీడు భూములను పచ్చని పంటలుగా మారుస్తున్న ఎస్సారెస్పీ చెంతనే జిల్లాలో హరితహారానికి పచ్చని మొక్కలు అందించే సెంట్రల్ నర్సరీ ఏర్పాటుకానున్నది. గ్రామ, అటవీ , ఇతర నర్సరీల ద్వారా ఇప్పటికే హరితహారం మహాయజ్ఞంలా కొనసాగుతున్నది. అవెన్యూ ప్లాంటేషన్, దేశీయ అటవీ పండ్ల చెట్లు, వాణిజ్య పండ్లు, మొక్కలు, హరితహారంతోపాటు ఇతర మొక్కలను పెద్ద ఎత్తున, మీటరున్నర నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఉండే మొక్కలను అందించే లక్ష్యంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సమీకృత సెంట్రల్ నర్సరీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాకో సమీకృత సెంట్రల్ నర్సరీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని మెండోరా మండలంలో ఎస్సారెస్పీ చెంతనే ఉన్న పోచంపాడ్లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతూ సంరక్షిస్తున్నది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీలను కీలకం చేసి వాటి ఆధ్వర్యంలో గ్రామ హరిత నర్సరీలను ఏర్పాటు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నది. మరోవైపు అటవీ శాఖ నర్సరీలు పెద్ద ఎత్తున మొక్కల్ని ఉత్పత్తి చేస్తూ వస్తున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో ఊరూరా…అటవీ శాఖ ఆధ్వర్యంలో అడుగడుగునా నర్సరీల ద్వారా హరితహారానికి అవసరమైన మొక్కలు అందుతున్నాయి. హరితహారంతోపాటు ఇతర మొక్కల అవసరాలు తీర్చేందుకు, అలాంటి మొక్కలను పెద్ద ఎత్తున అందించేందుకు జిల్లా స్థాయి నర్సరీల ఆవశ్యకతను గుర్తించారు. ఇందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 32 జిల్లాల్లో జిల్లాకో సమీకృత సెంట్రల్ నర్సరీ ఏర్పాటు జరుగుతున్నది.
అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇది వరకు నిర్వహిస్తున్న నర్సరీలు ఉపాధి హామీ, ‘కంపా’ సహకారంతో కొనసాగుతుండగా, సమీకృత సెంట్రల్ నర్సరీలకు నిధులు కేటాయిస్తున్నారు. సెంట్రల్ నర్సరీలను హైటెక్ నర్సరీలుగా కూడా పేర్కొంటున్నారు.అందుబాటులో ఉన్న స్థలంలో వీలైనన్నీ ఎక్కువ మొక్కలు పెంచే పద్ధతులను సమీకృత సెంట్రల్ నర్సరీల్లో అనుసరించనున్నారు. ట్రేల్లో ఉత్పత్తి చేయడం.. మొక్కలు వచ్చాక వాటిని బ్యాగుల్లోకి మార్చడం లాంటి విధానాలను అవలంబించనున్నారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో పోచంపాడ్లో ఏర్పాటు చేస్తు న్న సమీకృత సెంట్రల్ నర్సరీ హరితహారానికి, ఇతర మొక్క ల అవసరాలు తీర్చేందుకు కీలకంగా ఉపయోగపడనున్నది. ప్రాథమిక పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరగా దీని ఫలితాలు అందించేందుకు కృషి చేస్తున్నాం. హరితహారంతోపాటు ఇతర మొక్కల కొరత తీర్చడంలో ఈ సెంట్రల్ నర్సరీ ఎంతో దోహదపడుతుంది.
-శ్రీనివాస్, ఆర్మూర్ అటవీ రేంజ్ అధికారి