విద్యానగర్/ బాన్సువాడ టౌన్, మార్చి 25 : జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడలో శుక్రవారం ఉద యం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ధ్రువపత్రాలు లేని 168 ద్విచక్రవాహనాలు, 17 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో పట్టణ సీఐ నరేశ్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించగా, డీఎస్పీ సోమనాథం, ఎస్సై మధుసూదన్ గౌడ్,150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలో తనిఖీలు నిర్వహించి 120 ద్విచక్రవాహనాలు, 15 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో డీఎస్పీ జైపాల్ రెడ్డి, పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ మురళితో పాటు బాన్సువాడ డీఎస్పీ శాఖ పరిధిలోని ఏడు గురు ఎస్సైలు, సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని 120 ఇండ్లను తనిఖీ చేసి 48 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కాగితాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. చిన్నారులకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాల మీదకు తీసుకురావద్దన్నారు. మహిళలు, ఆడపిల్లలకు రక్షణ ఎంతో ముఖ్యమన్నారు. కాలనీలు, ప్రధాన చౌరస్తాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా వచ్చిన అపరిచితులకు ఇండ్లను అద్దెకు ఇవ్వొదన్నారు. అనుమానితుల వివరాలను వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతకు ముందు పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలు, సైబర్ నేరాలు-జాగ్రత్తలు, దొంగతనాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, స్థానిక కౌన్సిలర్ నర్సగొండ, నాయకులు వడ్ల శివ, మహేందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.