రుద్రూర్, మార్చి 25: అందరూ ఐకమత్యంగా ఉంటే గ్రామాల్లో అభివృద్ధి సాధించుకోవచ్చని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అన్నారు. మండలంలోని రాణంపల్లి, చిక్కడ్పల్లి, సులేమాన్‌నగర్ గ్రామాల్లో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాణంపల్లిలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డితో డబుల్బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్డు, జీపీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. గ్రామంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. ఓ చిన్నారితో ఓనమాలు రాయించి బహుమతిగా రూ. 500 నగదు అందజేశారు. బాలింతలు, గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారంపై ఆరాతీశారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల జాబితాను సర్పంచ్ రోజా చదివి వినిపించారు. రాణంపల్లి గ్రామానికి రో డ్డు, మరో 30 డబుల్బెడ్రూం ఇండ్లు అవసరమని తెలుపగా సానుకూలంగా స్పందించిన సభాపతికి సర్పంచ్ రోజాలక్ష్మణ్ సభాపతి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం చిక్కడ్‌పల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్డు, జీపీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ఇప్పటికే 30 డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు ప్రారంభంకావడం సంతోషంగా ఉందన్నారు.
విద్యుత్ అధికారులపై ఆగ్రహం
ఏడాది గడిచినా సులేమాన్ ఫారం నుంచి చిక్కడ్‌పల్లికి విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభించకపోవడంపై విద్యుత్ అధికారులపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పనులు చేస్తే చేయండి..లేదా ఇంటికి వెళ్లండి’ అంటూ మండిపడ్డారు. ఇరువైపులా ఉన్న రోడ్డును రైతులు కబ్జా చేస్తున్నారని పలువురు ఆరోపించగా, సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కబ్జా చేసినవారు తమంతతామే భూమిని వదిలిపెట్టాలని లేనిపక్షంలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిక్కడ్పల్లి చెరువుకు సంబంధించిన సమస్యపై కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన పనులు ప్రారంభించిన తరువాతే కొత్తపనులు అడగాలని సూచించారు. గోదాదేవి ఆలయ నిర్మాణంలో భాగంగా కిరీటం కోసం రెండు గ్రాముల బంగారాన్ని అందజేసిన సర్పంచ్ రోజాలక్ష్మణ్ను అభినందించారు.
అనంతరం సులేమాన్ నగర్లో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణానికి స్పీకర్ శంకుస్థాపన చేశారు. బసవేశ్వరాలయం వద్ద కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. పనులు ఇప్పించడం తన బాధ్యత అని, దగ్గరుండి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత , ఆర్డీవో రాజేశ్వర్, వైస్ ఎంపీపీ సాయిలు, విండో చైర్మన్ సంజీవ్‌రెడ్డి, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి బాలరాజు, సర్పంచ్ రోజా లక్ష్మణ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య తదితరులు పాల్గొన్నారు.