నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 25 : దీపావళి పండుగ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట జోరుగా కొనసాగింది. ప్రతి ఏడాది మాదిరిగానే జూదరులు ఈ సంవత్సరం సైతం పోలీసుల కండ్లు గప్పి రహస్య స్థావరాలతో పాటు హోటళ్లు, వ్యాపార సంస్థల్లో ఆదివారం నుంచి పేకాట అడ్డాలను ప్రారంభించుకున్నారు. పేకాడే వారిపై చర్య లు తీసుకోవాల్సిందిగా సీపీ కె.ఆర్.నాగరాజు ఆదేశాలు జారీ చేయడంతో కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో సంబంధిత ఏసీపీల పర్యవేక్షణలో సీఐల ఆధ్వర్యంలో ఎస్సైలు,సిబ్బందితో కలిసి పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు.
నిజామాబాద్ డివిజన్ పరిధిలో మొత్తం58 కేసులు నమోదు చేసి.. 372 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.5లక్షల 62 వేల 590 నగదు సీజ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 21 కేసులు నమోదు చేసి.. 108 మంది పేకాట రాయుళ్లలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. లక్షా 53 వేల 880 నగదు సీజ్ చేశారు. బోధన్ డివిజన్ పరిధిలో 21 కేసులు నమోదు చేసి.. 107 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని రూ.లక్షా 92 వేల 100 నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలను నియంత్రించేందుకు ప్రత్యే నిఘా బృందాలతో పాటు కంట్రోల్ రూం సైతం ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం100 పేకాట కేసులు నమోదు చేసి.. 587 మంది జూదరులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోలు నమోదు చేయడంతో పాటు రూ.9,08,570 నగదు సీజ్ చేసినట్లు సీపీ నాగరాజు వెల్లడించారు.