నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంలో భాగంగా జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ అమరవీరులకు పేరుపేరున ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల కోసం పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తారన్నారు. యావత్తు జాతి పోలీస్ అమరవీరులకు రుణపడి ఉంటుందన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు పోలీస్ శాఖ వెన్నెముకలాంటిందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను కల్పించాలని, ప్రభుత్వం వారి యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 264 మంది తమ ప్రాణాలను అర్పించారని కలెక్టర్ గుర్తుచేశారు. ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, ముగ్గురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 22 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 32 మంది ఏఎస్సైలు, 48 మంది హెడ్ కాన్సిస్టేబుళ్లు, 145 మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు హోంగార్డులు అమరులయ్యారని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో 18 మంది పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు.
దేశం, రాష్ట్రం కోసం ప్రాణాలను త్యాగం చేశారు
దేశం, రాష్ట్రం కోసం పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఆ అమరవీరులను స్మరించుకోనే రోజు అక్టోబర్ 21 అని సీపీ నాగరాజు అన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లవేళలా కృషిచేస్తున్నారని చెప్పారు. 1959 అక్టోబర్ 21న అక్సాయిచిన్ వద్ద చైనా ఎదురుదాడిలో విధి నిర్వహణలో ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. అప్పటి నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకొంటున్నామని తెలిపారు.
నిజామాబాద్ జిల్లా పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. అమర వీరుల స్తూపం వద్ద పూలను ఉంచి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలటు మౌనం పాటించారు. అమరవీరుల కుటుంబాలకు పట్టాలు, గిఫ్ట్ ప్యాక్లను కలెక్టర్, సీపీ అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, ఏసీపీలు వెంకటేశ్వర్, సంతోష్, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్సైలు, ఆర్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.