ఖలీల్‌వాడి, అక్టోబర్ 21 : జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన వైద్యులు మోకీలు మార్పిడి సర్జరీల్లో రికార్డు సృష్టించారని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు అన్నారు. జడ్పీ కార్యాలయంలో శుక్రవారం దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు నాగేశ్వర్రావు, ఒక్కెర్ల కిరణ్, గవాస్కర్, సంతోష్, నవీన్, బాబురావు, అనస్థీషియా డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖాన వైద్యులు 24 గంటల్లో 10 మోకీలు మార్పిడి సర్జరీలు చేయడంతో వారిని సన్మానించామన్నారు. 3 నెలల్లో 60 మందికి శస్త్ర చికిత్సలు చేయడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ఈ సర్జరీకి రూ. 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.
గతంలో గాంధీ దవాఖానలో 24 గంటల్లో 9 మందికి ఆపరేషన్లు చేయగా ఇప్పుడు జీజీహెచ్ దాన్ని అధిగమించిందన్నారు. వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో దవాఖానలో కొత్తగా ఇద్దరు వైద్యులతో నెఫ్రాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రతి బుధ, శనివారాల్లో ఉదయం 9 నుంచి12 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని.. జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.