కమ్మర్పల్లి, అక్టోబర్ 18: పరుచుకున్న పచ్చని అందాలు.. పక్కనే ఎత్తయిన గుట్టలు.. చుట్టుపక్కల పంట పొలాలు.. వీటి మధ్యలో వెలిసిన పల్లె ప్రకృతివనం ఆకట్టుకుంటున్నది. చౌట్పల్లి శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం ప్రభుత్వ ఆలోచనకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం సందర్శకులను కట్టి పడేస్తున్నది. పెద్ద పెద్ద చెట్లు, పచ్చని తివాచీల్లా ఏర్పాటు చేసిన గార్డెనింగ్.. ఇతర ప్రకృతి అందాలు.. ప్రీ వెడ్డింగ్ షూట్‌కు అనువుగా మారాయి.
సీఎం కేసీఆర్ మాసస పుత్రిక పల్లెప్రగతి. అందులోంచి పుట్టిందే.. పల్లె ప్రకృతివనం. పలెల్లు అంటేనే సహజ సిద్ధ అందాలకు, స్వచ్ఛమైన వాతావరణానికి నిలయాలు. కానీ, రానురానూ పల్లెల్లోనూ పది నిమిషాలైనా ఆస్వాదించ దగ్గ ఆహ్లాదకరమైన ప్రదేశాలే కరువైన పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి కొరతను క్రమంగా తీర్చాలన్న లక్ష్యంతో చేపట్టినవే పల్లె ప్రకృతి వనాలు. అలా లక్ష్యం దిశగా అభివృద్ధి చెందుతున్న పల్లెప్రకృతి వనాలు నేడు ఊరూరా వెలిశాయి. అందులో కొన్ని గ్రామాల్లోని పల్లె ప్రకృతివనాలు అద్భుతంగా.. ఆదర్శంగా నిలుస్తున్నాయి. అలాంటిదే నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి పల్లె ప్రకృతివనం.
చూడగానే ఆహా..వహ్వా అనిపించేలా..ఏకంగా కొత్త పెండ్లి జంటలు ఫొటో షూట్ చేసుకునేలా..హాలి డే వస్తే పిల్లాపాపలతో పిక్నిక్కు వెళ్లాలనిపించేలా పచ్చని అందాలతో, పక్కనే ఆధ్మాత్మిక పరిమళాలతో అలరారుతున్నది చౌట్పల్లి పల్లె ప్రకృతి వనం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు దర్పణంలా నిలుస్తున్నది.
పట్టణ పార్కును తలపించేలా..
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో 63వ నంబరు జాతీయ రహదారి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌట్పల్లి గ్రామానికి సమీపంలో ఈ పల్లె ప్రకృతివనం ఉన్నది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దిశానిర్దేశంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో గుండు హనుమాన్ ఆలయం పక్కన పట్టణ పార్కును తలపించేలా పల్లె ప్రకృతివనాన్ని రూపొందించారు. ఏపుగా చెట్లు, పార్కు నిండా పచ్చని మైదానం, సేదతీరేందుకు బెంచీలు, పల్లె చిహ్నంగా జోడెద్దుల బొమ్మలు, పార్కు మధ్యలోంచి తిన్నగా దారులు, స్నానాల కుండీలు, పూల మొక్కలు, పార్కూ.. ఆలయ పరిసరాలు కలిసి పోయినట్లు ఆధ్యాత్మిక వనాన్ని తలపించేలా ఉంటుంది. సెలవు దినాల్లో చుట్టు పక్క గ్రామాల నుంచి పిక్నిక్కు వచ్చిన కుటుంబాల సందడి కనిపిస్తుంది. కొత్తగా పెండ్లి కుదిరిన జంటల ప్రీ వెడ్డింగ్ దృశ్యాలు కనిపిస్తాయి.