నిజామాబాద్ క్రైం,అక్టోబర్18 : దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.నాగరాజు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో జీవో నెంబర్ 163 ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలికంగా పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసేవారు తప్పకుండా సంబంధిత ఏసీపీ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారి అనుమతి లేకుండా దుకాణాలను ఏర్పాటు చేస్తే వారిపై ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ 1884 రూల్ 1933 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పటాకుల దుకాణాలను కల్యాణ మండపాలు, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి, అక్కడి వారి నుంచి ఎన్వోసీ పొందాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలను చేశారు. ప్రతి షాపు మధ్య 3 మీటర్ల దూరం ఉండాలి. నివాస స్థలాలకు 50 మీటర్ల దూరంలో ఉండాలి. ఒక్కో ప్రాంతంలో 50 షాపులకు మించి ఏర్పాటు చేయకూడదు. రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి దుకాణాలను ఏర్పాటు చేయకూడదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే పటాకుల దుకాణాల్లో ఫైర్‌కు సంబంధించి జాగ్రత్తలు తప్పక పాటించాలి. షాపుల ఏర్పాటు కోసం పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన www.nizamabadpolice.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని అందులో పూర్తి వివరాలను నమోదు చేసి, సంబంధిత ఏసీపీకి అందజేసి అనుమతి పొందాలని సీపీ నాగరాజు సూచించారు.