బోధన్, అక్టోబర్ 17: తెలంగాణలో పాదయాత్ర పేరిట పర్యటిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలని, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక తన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బోధన్ నియోజకవర్గ నాయకులు ధ్వజమెత్తారు. బోధన్ నియోజకవర్గంలో నిర్వహించిన తన పాదయాత్రలో సీఎం కేసీఆర్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్‌పై షర్మిల ఆరోపణలు చేయడంపై వారు మండిపడ్డారు. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, రైతుబంధు సమితి బోధన్ మండల మాజీ కో-ఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ బోధన్ మండలం అధ్యక్షుడు గోగినేని నర్సయ్య, పార్టీ మండల కార్యదర్శి సిర్ప సుదర్శన్, బోధన్ ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూర షకీల్ తదితరులు మాట్లాడారు. షర్మిల వెంటనే పాదయాత్ర ఆపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ పేరును ఇక్కడ ఉచ్ఛరించే హక్కు షర్మిలకు లేదన్నారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కండ్లకు కనపడడంలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సుమారు 15 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ ప్రత్యేక రాష్టాన్ని సాధించారని, అటువంటి నాయకుడిని విమర్శిస్తే ప్రజలు సహించబోరన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం సొంత డబ్బును కూడా ఖర్చుచేసే బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను ఉద్దేశించి షర్మిల విమర్శలు చేయడం శోచనీయమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేందుకు నిరంతరం కృషిచేస్తున్న ఘనత షకీల్‌కు దక్కుతుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే ఇక్కడి ప్రజలు సహించబోరని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) బోధన్ మండలం నాయకులు కొప్పర్తి బుజ్జి, వినోద్ నాయక్, నరేశ్, గాండ్ల పెద్ద రాజేశ్వర్, మధుకర్, సాయి, పాషా, మజార్ అలీ పాల్గొన్నారు.