నిజామాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రోడ్డు ప్రమాదాలతో నిత్యం వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసుకుంటున్న వారు కొందరైతే… తాగి తూగుతూ వాహనంతో రోడ్డెక్కిన వారే అత్యధిక మంది ఉంటున్నా రు. రాత్రి వేళల్లో ఫుల్‌గా మద్యం సేవించి ప్రధాన రహదారులపై అదుపు తప్పి డ్రైవింగ్ చేస్తుండడం తో ఎదురుగా వస్తున్న అమాయకుల ప్రాణాలు సైతం మందుబాబుల వల్ల గాల్లో కలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరంగా చేస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ మందుబాబుల ఆగడాలు ఆగడం లేదు. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిజామాబాద్ కమిషనరేట్‌లో 4,226 కేసులు నమోదు కాగా 2022, జనవరి – జూన్ నెలాఖరుకు 6వేల కేసులు నమోదు కావడం విశేషం.
6నెలల్లో 6వేల కేసులు…
తప్పతాగి వాహనాలతో రోడ్డెక్కుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతున్నది. పోలీసులు నిర్వహిస్తున్న బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో పట్టుబడుతున్న తాగుబోతుల సంఖ్యతో తేటతెల్లం అవుతోంది. కొద్ది మంది మద్యం బానిసపరుల మూలంగా నిత్యం వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి ప్రమాదాల్లో గాయాలపాలై నెలల కొద్ది ఇంటికే పరిమితం అవుతున్నవారూ లేకపోలేదు. మద్యం తాగి మితిమీరిన వేగంతో ప్రమాదాలు చేస్తున్న వారి మూలంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే అవుతున్నది. పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాగుబోతుల్లో మాత్రం కనీసం మార్పు కనిపించడం లేదు. 2021 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు 4,226 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వెలుగు చూశాయి. 2022లో జనవరి నుంచి జూన్ నెలాఖరుకు అంటే ఆరు నెలల కాలంలో అక్షరాల 5,998 కేసులు వెలుగు చూడడం విడ్డూరంగా మారింది. జనవరిలో 807, ఫిబ్రవరిలో 691, మార్చిలో 1026, ఏప్రిల్‌లో 1034, మేలో 1,147, జూన్‌లో 1,293 కేసులున్నాయి.
గతం కన్నా రెట్టింపు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తనిఖీలు మరింత పెంచి తాగుబోతులపై కఠినంగా వ్యవహరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
సమయ పాలనపై నియంత్రణేది…?
నగర శివారులో ఆగస్టు మొదటి వారంలో బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వాహనదారుడు చుక్కలు చూపించాడు. రాత్రి 11 గంటలకు మద్యం సేవించి పోలీసులకు చిక్కాడు. ఈ సమయంలో పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదం పెట్టుకున్నాడు. మద్యం దుకాణాలు, బార్లను టైమ్‌కు మూసెయ్యాలని వాదించడం ఆలోచన తెప్పించింది. పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడుతూ సామాన్యులపై ప్రతాపం చూపిస్తే ఎలా అంటూ ఓ వాహనాదారు ఎదురు ప్రశ్నించడంతో పోలీసులు నోరు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో వాస్తవ ఘటనకు ఉదాహరణగా నిలుస్తోంది. మామూళ్లకు అలవాటు పడుతున్న పోలీసులు, ఎక్సైజ్ శాఖలు మద్యం దుకాణాలు, బార్లపై నియంత్రణ చేయడం లేదు. వారిచ్చే పైకానికి బానిసలుగా మారి అర్ధరాత్రి వరకు నిర్వాహకులకు వత్తాసు పలుకుతున్నారు. సమయానికి బార్లు, మద్యం దుకాణాలను మూసేస్తే రాత్రి వేళల్లో మద్యం ప్రియుల అలజడి తగ్గే అవకాశాలున్నట్లుగా నగర జనాలు అనుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021 వెలుగు చూసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే అత్యధికం అనుకుంటే ఈ ఏడాదిలో ఆరు నెలలకే రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూడడం విచిత్రంగా మారింది. 2019లో 1065 కేసులు, 2020లో 634 కేసులు, 2021లో మాత్రం ఏకంగా 4,226 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
నిరంతరం కౌన్సెలింగ్…
పోలీసులు ప్రతి రోజూ సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కాపు కాసి తాగుబోతులను పట్టుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి భరతం పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి బ్రీత్ ఎనలైజర్ పరికరాల ద్వారా పరీక్షలు చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాన్ని నడుపుతున్న వారిలో ఎంతటి వారికైనా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం తమ శాఖ సిబ్బంది విషయంలో మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టిక్కర్‌తో వచ్చే వాహనాలను గుడ్డిగా వదిలేయడం వంటివి అనేక చోట్ల తరచూ జరుగుతున్నాయి. కొద్ది మంది ఏకంగా పోలీస్ సిబ్బంది వాహనాలను చేతపట్టుకుని మద్యం తాగి చెట్టాపట్టాల్ వేసుకుని బజార్లో రాత్రి పగలు తేడా లేకుండా సంచరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రజలు భావిస్తున్నారు. నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహిస్తే రోడ్డు ప్రమాదాల నియంత్రణ అనే ఆశయం నీరుగారే ఆస్కారం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.