బాన్సువాడ టౌన్, అక్టోబర్ 17: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ అందేలా చూడాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి..స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. కొంత మంది ఆసరా పింఛన్ల గురించి అవగాహన లేక తన వద్దకు వస్తున్నారని, వారి సమస్యలను దగ్గరుండి పరిష్కరించాలన్నారు. సోమవారం ఆయన పట్టణంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. నాయకులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా అభివృద్ధి పనులు నిలిచిపోతే అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అది నాయకులుగా మనందరి ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం లేకుం డా ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
రోడ్డు, డ్రైనేజీలపై నిర్మాణాలను సహించేదిలేదు
బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీల్లో డ్రైనేజీ నిర్మాణ పనులను కూడా తొందరగా పూర్తిచేయాలన్నారు.ఎవరైనా ప్రభుత్వ స్థలం లో లేదా డ్రైనేజీలపై ఇండ్లు, ఇండ్లకు సంబంధించి మెట్లు నిర్మించినా సహించేదిలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వర్షపు నీరు నిలి చి ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి నిర్మాణాలను వెంటనే గుర్తించాలని మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కు సూచించారు. భావితరాలు, పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, నాయకులు, పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నా యకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.