ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17,407 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13,702 మంది హాజరు కాగా 3,705 మంది గైర్హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 77.69, కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదయ్యింది. పరీక్షా కేంద్రాలను కలెక్టర్లు, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. బస్టాండ్ల వద్ద అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్‌లతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది.
ఇందూరు/విద్యానగర్, అక్టోబర్ 16: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 9,990 మంది పరీక్ష రాయగా, 2,868 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్‌వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించలేదు. అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ను స్వీకరించిన అనంతరం అభ్యర్థి ఫొటో తీసుకొని హాల్‌టికెట్‌పై ఆమోదిత ముద్ర వేసి పరీక్ష గదిలోకి అనుమతించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి సూచనల మేరకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల వద్ద హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయడంతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేసేలా ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కేఆర్ నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాల, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. టీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా ? లేదా ? అన్నది సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిర్ధారణ చేసుకున్నారు. కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. బయోమెట్రిక్ ద్వారా చేపట్టిన వేలిముద్రల సేకరణ ప్రక్రియపై కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. వారి వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు నటరాజ్, ప్రసాద్‌రావు, లైజనింగ్ అధికారులున్నారు.
కామారెడ్డి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 3,712 మంది హాజరు కాగా 837 మంది గైర్హాజరయ్యారు. 81.60 హాజరు శాతం నమోదైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ, సాందీపని జూనియర్ కళాశాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కేంద్రాల వద్ద బయోమెట్రిక్ విధానాన్ని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కేంద్రాల్లో కల్పించిన వసతులను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు.