రెంజల్, అక్టోబర్ 16: అంతర్రాష్ట్ర రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు రోజూ త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రోడ్డు మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గుంతలు మరింత పెద్దగా మారాయి. తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.
మహారాష్ట్ర – తెలంగాణ సరిహద్దులో నవీపేట నుంచి కందకుర్తి వరకు ప్రధాన రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు రోడ్డు మరమ్మతు కోసం ప్రభుత్వం రూ. 40లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించడం దు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తామని జూలైలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆశాఖ పని తీరు ఉందని మండల ప్రజలు మండి పడుతున్నారు. రెంజల్ నుంచి కందకుర్తి వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలు వర్షం కారణంగా రోజురోజుకూ పెద్దగా మారుతున్నాయి. రాత్రి సమయంలో ఈమార్గం గుండా రాకపోకలు కొనసాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలకు తోడు స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకంగా మారాయి. వాటిని తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మలతు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు.
– ఖలీంబేగ్, సర్పంచ్, కందకుర్తి
మరమ్మతుల కోసం మంజూరైన నిధులతో పనులను వెంటనే ప్రారంభించాలి. పనులు ఆలస్యం కావడంతో ఈ రోడ్డుగుండా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి.
-హైమద్ఖాన్, సాటాపూర్
నవీపేట నుంచి కందకుర్తి వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు నిధులు మంజూరయ్యాయి. వర్షాలు కురుస్తుండడంతో పనులు చేపట్టడంలేదు. త్వరలో పనులను చేపడుతాం.
– రామ్మోహన్, ఆర్అండ్బీ డీఈ, బోధన్