ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు.. ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్ధమవుతున్నాడు. కారణం.. నిత్య జీవితంలో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండడమే. అయితే మనిషిని ఆరోగ్యంగా ఉంచాలన్నా.. అనారోగ్యం పాలు చేయాలన్నా ఆ శక్తి ఆహార పదార్థాలకు ఉన్నది. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతోనే ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బెల్లం ఒకటి. అసలు బెల్లంలో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటీ అనే విషయాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 15:
బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది. దీంతో శరీరానికి ఎలాంటి హాని ఉండదు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. బెల్లం రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చలికాలంలో బెల్లం తినడం ఇంకా మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబును నివారిస్తుంది. బెల్లం మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఎంజైములను ఉత్తేజపరుస్తాయి. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్థాలను బయటికి పంపుతుంది.
రోజూ ఒక బెల్లం ముక్క తింటే పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు వేడి నీళ్లలో బెల్లం కలుపుకొని తాగితే సమస్య దూరమవుతుంది. చాయ్‌లో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. బెల్లంలో జింక్, సిలినియమ్ మూలకాలు ఉండడంతో ఇన్ఫెక్షన్లతో దెబ్బతిన్న కణాలను తిరిగి బాగుచేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. బెల్లం గర్భిణులకు చాలా మంచిది. బెల్లంలో అధిక మోతాదులో ఉండే మాంగనీస్ కడుపులోని పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
బెల్లంలో ఉండే పోషకాలు మహిళలకు రుతు సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. దీంతో శరీరంలో ఎండార్పిన్లు విడుదలవుతాయి. ఇవి శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. కీళ్ల నొప్పులు, మంటలతో బాధపడేవాళ్లు బెల్లం తినాలి. అల్లంతో కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది. రోజూ పాలలో బెల్లం కలుపుకొని తాగితే ఎముకలు పుష్టిగా అవుతాయి.
– డాక్టర్ రవీంద్రమోహన్, ప్రభుత్వ దవాఖాన వైద్యుడు, ఎల్లారెడ్డి