నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్టుకు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎస్పీఎస్సీ ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్నది. ఉమ్మడి జిలాలో 20,407 మంది పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించనున్నారు. సుమారు పదకొండేడ్ల సుదీర్ఘ విరామం అనంతరం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 పరీక్ష ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు ప్రిలిమ్స్‌కు హాజరు కానున్నారు. తమ జీవిత లక్ష్యమైన కొలువు సాధన కోసం ఎన్నాళ్ల నుంచో నిరుద్యోగులు సన్నద్ధమయ్యారు. ఉజ్వల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్లూ కష్టపడి చదివారు. వారందరికీ ‘నమస్తే తెలంగాణ’ తరఫున ఆల్ ది బెస్ట్..
నిజామాబాద్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రూప్ -1 ప్రిలిమ్స్‌కు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పా ట్లు పూర్తయ్యాయి. పది రోజుల ముందు నుంచే టీఎస్పీఎస్సీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో మునిగి తేలుతున్నది. టీఎస్పీఎస్సీ ఏర్పాటు అనంతరం వెలువడిన నోటిఫికేషన్లలో గ్రూప్-1 చాలా ప్రత్యేకమైనదే కాకుండా ఇదే తొలి నోటిఫికేషన్. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో జారీ చేసిన గ్రూప్-1 తర్వాత వెలువడిన నోటిఫికేషన్ ఇదే. టీఎస్పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జిల్లా కలెక్టర్ల ద్వారా నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది. పరీక్ష సమయానికి నిమిషం నిబంధన అన్నది పక్కన పెట్టి ఏకంగా 15 నిమిషాల ముందుగానే ప్రధాన గేటును మూసేస్తున్నట్లుగా ప్రకటించింది. అభ్యర్థులు ఉదయం 10.15 గంటల్లోపే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే అనుమతి ఉండబోదని ఇప్పటికే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 17,417 మంది పరీక్ష రాయబోతున్నారు. 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వాస్తవానికి గ్రూప్-1 పరీక్షకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లోటుపాట్లతోపాటు అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బయోమెట్రిక్ హాజరును తీసుకుంటున్నారు. ప్రతి అభ్యర్థి నుంచి వేలిముద్రల ద్వారా హాజరు తీసుకుంటారు. ఇందుకోసమే 2గంటల ముందు నుంచే పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతిస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ పేర్కొన్నది. ఉదయం 10.30 గంటలకు పరీక్ష మొదలవుతున్నప్పటికీ 8.30గంటల నుంచే పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అనంతరం బయోమెట్రిక్ ప్రాసెస్‌ను చేపట్టబోతున్నారు. ప్రతి 60 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగిస్తున్నారు. యంత్రాలు మొరాయించినా, రద్దీ ఏర్పడినా సులువుగా ప్రాసెస్ పూర్తి చేసేందుకు విరివిగా బయోమెట్రిక్ డివైస్‌లను తెప్పించారు. ప్రతి సెంటర్ వద్ద మహిళా, పురుష కానిస్టేబుళ్లతో భద్రత కల్పిస్తున్నారు. మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేపట్టబోతున్నారు. ముందస్తుగానే అభ్యర్థులంతా టీఎస్పీఎస్సీ నిబంధనల మేరకు సెంటర్‌కు రావాలని అధికారులు విన్నవిస్తున్నారు.
గ్రూప్-1 పరీక్ష కొనసాగుతున్న సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ చుట్టూ జిరాక్స్ దుకాణాలను మూసేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. హాల్‌టికెట్‌తోపాటు ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 24 మంది బధిరులు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. వీరంతా సదరం సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే ప్రత్యేక ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన సెంటర్లలో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సెంటర్లలో వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేయబోతున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్కాడ్, ఏడు కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్కాడ్‌ను ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. వాస్తవానికి మన జిల్లా నుంచి 49వేల మంది గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. వీరిలో నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాన్ని పెట్టుకున్న వారు మాత్రం తక్కువ మందే. వీరి కోసం 40 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కనిష్ఠంగా ఒక్కో కేంద్రంలో 200 మంది నుంచి గరిష్ఠంగా 600 మంది వరకు కేటాయించారు. రోడ్డు, రవాణా వసతి సరిగ్గా ఉన్న ప్రాంతాలనే సెంటర్లుగా నిర్ణయించారు. మారుమూల ప్రాంతాల్లో సెంటర్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. బస్టాండ్‌లో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకు రావడంతోపాటు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఏ సెంటర్‌కు ఏ విధంగా చేరుకోవాలి? అన్న విషయాన్ని స్పష్టంగా సూచించేలా రూట్ మ్యాప్‌లను హెల్ప్‌డెస్క్‌లో ప్రదర్శించారు. గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు, అభ్యర్థులకు సూచనలు అందించేందుకు హెల్ప్‌డెస్క్ ప్రతినిధులు సహకరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలో 4,549 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. వీరికోసం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.