ఇందూరు, అక్టోబర్ 15 : జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో శనివారం సెల్కాన్పరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రామసచివాలయాలు ఎన్పీడీసీఎల్కు సుమారు రూ.35 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉన్న అంశాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. డివిజన్ల వారీగా పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిల వివరాలను డీఎల్పీవోలను అడిగి తెలుసుకున్నారు.
జీపీలు చెల్లించాల్సి ఉన్న విద్యుత్ బకాయిలను దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంచడాన్ని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని తెలిపారు. జీపీల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా విద్యుత్ బకాయిల చెల్లింపులకే వినియోగించాలని సూచించారు. జీపీల ఖాతాల్లో అందుబాటులో ఉన్న వాటిలో కనీసం 80 శాతం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపులకే వెచ్చించాలన్నారు. ఈ నెల 19వ తేదీలోగా ఎన్పీడీసీఎల్ పేరిట చెక్కులను ట్రెజరీలకు పంపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిల చెల్లింపులకు సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పూర్తి సహకారమందించాలన్నారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు జీపీల పరిధిలో అవసరం లేని బోరుమోటార్లను తొలగించాలని కలెక్టర్ సూచించారు. సెల్కాన్ఫరెన్స్లో డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.