శక్కర్‌నగర్, అక్టోబర్ 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆయా పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బోధన్ పట్టణంలోని పలు పాఠశాలల్లో మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన నిధులతో చేపడుతున్న పనులను శనివారం ఆయన పరిశీలించారు. బోధన్‌లో రూ.30లక్షల లోపు పది పాఠశాలలకు, రూ.50 లక్షల లోపు ఐదు పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దశల వారీగా మంజూరైన నిధులతో పనులు సాగుతున్నాయన్నారు. పలు పాఠశాలల్లో పనులు చివరిదశకు చేరాయని తెలిపారు.
భీమ్‌గల్, అక్టోబర్ 15: బడాభీమ్గల్లోని జడ్పీహెచ్ఎస్, సికింద్రాపూర్లోని జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను జిల్లా విద్యాధికారి ఎన్వి.దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత గల సామగ్రిని ఉపయోగించాలని ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి స్వామి, హెచ్ఎం రమేశ్, వెంకట్‌రెడ్డి, మురళి, ఉపాధ్యాయులు ఉన్నారు.
నవీపేట, అక్టోబర్ 15: మన ఊరు-మన బడి అభివృద్ధ్ది పనులను ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని, పనులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతోపాటు ఎస్ఎంసీ చైర్మన్లు, గుత్తేదారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎంపీడీవో గోపాలకృష్ణ హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలో హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో 20 పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ఎంపికైనట్లు చెప్పారు. మొదటి విడుతలో 15 పాఠశాలల్లో పనులను ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని అన్నారు. ఎంపీపీ సంగెం శ్రీనివాస్ పాల్గొన్నారు.