కోటగిరి అక్టోబర్ 15: పండుగల వేళ గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వేతనాలను 30 శాతం పెంచింది. పశువుల సంరక్షణ, సంతతి వృద్ధికి కృషిచేస్తున్న వీరి సమస్యలను ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పట్టించుకోలేదు. చాలీచాలని వేతనంతో పనిచేస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిపడేవారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ కర్షకులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, హోంగార్డులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచారు. ఇందులో భాగంగా గోపాలమిత్రలకు కూడా సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 2017లో తొలిసారి వీరి వేతనాలను రూ.3,500 నుంచి రూ.8,500కు పెంచారు. తాజాగా మరో 30 శాతం అంటే రూ.11.050కు పెంచుతూ జీవో జారీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 127 మంది గోపాలమిత్రలకు లబ్ధి చేకూరనుండగా ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పాలన కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు అండగా నిలుస్తుండడంతో పాటు వాటి అమలు కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటున్నది. ఇందులో భాగంగా పశువుల సంరక్షణ, సంతతి వృద్ధికి కృషిచేస్తున్న గోపాలమిత్రలకు రాష్ట్ర సర్కారు సముచిత గౌరవాన్ని ఇచ్చింది. పండుగల వేళ వారి గౌరవ వేతనాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. దీం తో కామారెడ్డి జిల్లాలో 63, నిజామాబాద్ జిల్లాలో 64 మంది గోపాలమిత్రలు లబ్ధి పొందనున్నారు. పశు గణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న వీరు పశువుల సంరక్షణ, వాటి సంతతి పెంపు విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కృత్రిమ గర్భధారణతో మేలు జాతి పశువుల సంతతి పెంచడం, పశు గ్రాసం పెంప కం, దూడల పోషణ, పశువుల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నట్టల నివారణ మందు పంపిణీ, వ్యాక్సినేషన్ వంటి పనుల్లో పశువైద్య సిబ్బందికి సహాయ పడుతున్నారు. కాగా వీరి సేవలను గుర్తించిన రాష్ట్ర సర్కారు ఇటీవల గౌరవ వేతనాన్ని 30 శాతం పెంచుతూ నిర్ణయించడంతో పాటు జీవో ను సైతం జారీ చేసింది. ప్రస్తుతం వారికి నెలకు రూ.8,500 అందుతుండగా.. తాజా పెంపుతో రూ.11,050కు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో గోపాలమిత్రలు నెలకు కేవలం రూ.రెండు వేలతో పనిచేశారు. కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడ్డా రు. వీరి సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2017లో తొలిసారి రూ.3500 నుంచి రూ.8500కు పెంచారు. తాజాగా రెండో సారి వేతనాలు పెంచి సముచిత గౌరవ వేతనాన్ని ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో గోపాలమిత్రలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మేలు జాతి పశువుల పెంపులో గోపాలమిత్రలు కీలకంగా పనిచేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 127 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో వీరికి రూ.8,500 గౌరవ వేతనం ఉండగా, తాజా నిర్ణయంతో రూ.11,050కి చేరింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున మరింత ఉత్పాహంగా పని చేయాలి.
– శ్రీశైలం, పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి, ఉమ్మడి నిజామామాద్ జిల్లా
సీఎం కేసీఆర్ గోపాలమిత్రల శ్రమను గుర్తించి వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాల పాలనలో చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడ్డాం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మా సేవలను గుర్తించి రెండు సార్లు వేతనాలు పెంచి సముచిత గౌరవం ఇచ్చారు. మరింత ఉత్సాహంగా పని చేస్తాం..
– కృష్ణాగౌడ్, గోపాలమిత్రల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు