జీవితాన్ని మార్చేసేది గ్రూప్-1 పోటీ పరీక్ష.. ఆగం కాకుండా ప్రశాంతంగా ఆలోచించి జవాబులు రాస్తే విజయం సాధించవచ్చని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించనున్న తరుణంలో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ‘నమస్తే తెలంగాణ’ నడుం బిగించింది. శుక్రవారం ‘కలెక్టర్‌తో ఫోన్ ఇన్’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఉద్యోగార్థుల సందేహాలను సావధానంగా ఆలకించిన జిల్లా పాలనాధికారి.. ఓపికగా వారికి సమాధానాలు ఇచ్చారు. మీ ఆశయం గొప్పదైనప్పుడు చిన్న చిన్న అనుమానాలతో భయపడాల్సి అవసరం లేదని, ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను జిల్లాలో అత్యంత పకడ్బందీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చే ప్రతి అభ్యర్థీ బయోమెట్రిక్‌ను జాగ్రత్తగా తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. అందుకే చేతిపై ఎలాంటి రాతలు, గీతలు లేకుండా మెహందీ వంటివి కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. “నమస్తే తెలంగాణ” ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన నేరుగా అభ్యర్థులతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి జిల్లా నుంచి కూడా అభ్యర్థులు ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వేల్పూర్‌కు చెందిన ఓ అభ్యర్థికి హాల్ టికెట్‌పై పేరు రాకపోవడంపై కలెక్టర్‌కు విన్నవించగా న్యాయం చేస్తానని అభయం అందించారు. ఓఎమ్ఆర్ షీట్లో వివరాలను నమోదు చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ చెప్పారు. హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నాపత్రం కోడ్‌ను తప్పు దిద్దితే ఓఎమ్ఆర్ పనికి రాదన్నారు. అభ్యర్థులంతా ఇప్పుడున్న సమయాన్ని రివిజన్ పైనే దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికిప్పుడు చదవడం ద్వారా లాభం లేదన్నారు. అభ్యర్థుల నుంచి అనేక ప్రశ్నలు రాగా కలెక్టర్ చెప్పిన సమాధానాల్లో కొన్ని మీకోసం..
గ్రూప్ -1 ప్రిలిమ్స్ రాయబోతున్నాను. నేను వివాహితను. మెడలో ఆభరణాలతో రావొచ్చా?
– కల్పన, బోధన్
టీఎస్పీఎస్సీ వాళ్లు గ్రూప్-1 పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నందున అభ్యర్థులే స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వివాహితులు తప్పనిసరిగా మంగళసూత్రాలతో పరీక్షకు హాజరుకావొచ్చు. కాకపోతే భారీ ఆభరణాలను వేసుకోకపోవడం మంచిది. ఆభరణాల్లో ఏమైనా డిజిటల్ పరికరాలు వంటివి ఉండకూడదు. మెటల్ డిటెక్టర్‌లో ఇతరత్రా వస్తువులను గుర్తించే ప్రక్రియ ఉంటుంది.
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ప్రణీత
కలెక్టర్ : చదివింది ప్రాపర్‌గా రివిజన్ చేసుకోవాలి. భయం వీడాలి. ధైర్యం గా ఉంటే అనుకున్నది సాధించవచ్చు. గందరగోళానికి గురి కావొద్దు. క్లిష్టమైన ప్రశ్నలు తలెత్తితే నిదానంగా ఆలోచించి సమాధానం పెట్టండి.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సెంటర్ ఎక్కడ ఉందో తెలియదు. ఏమైనా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారా? ఎలా చేరుకోవాలి?
– సుంకరి రాజన్న, ఆర్మూర్
కలెక్టర్ : ప్రధాన బస్టాండ్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల వారికి అనువుగా హెల్ప్డెస్క్లోని వ్యక్తుల ద్వారా సెంటర్ చిరునామా తెలుస్తుంది. కొన్ని రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఆ బస్సులు ఉదయం 8.30గంటల వరకు సెంటర్‌కు వచ్చేలా ప్లాన్ చేశాం. ఈ మేరకు గ్రామీణ ప్రాంత యువత టైం ప్లాన్ చేసుకోండి.
హాల్‌టికెట్‌ను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నాను. పరీక్షకు ఏ ఐడీ కార్డును వెంట తీసుకువెళ్లాలి?
– రవి, అభ్యర్థి
కలెక్టర్ : టీఎస్పీఎస్సీ ద్వారా జారీ చేసిన హాల్‌టికెట్‌తోపాటు తప్పనిసరిగా మీరు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఆధార్, ఓటర్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు ఇలా ప్రభుత్వం జారీ చేసినది ఉంటే సరిపోతుంది. ఐడీ కార్డు మాత్రం తప్పనిసరి.
ఓఎమ్ఆర్లో బబుల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
– చరణ్ సింగ్, రెంజల్
కలెక్టర్ : ఓఎమ్ఆర్లో జవాబులు నింపే పద్ధతిని బబుల్ చేయడం(పెన్నుతో నిండుగా దిద్దడం) చాలా ముఖ్యమైనది. బాల్ పాయింట్ పెన్నునే వాడాలి. బ్లాక్ లేదా బ్లూ కలర్ సరిపోతుంది. మిగిలిన ఏ కలర్ పెన్ను వాడినా ఓఎమ్ఆర్ను డిస్ క్వాలిఫై చేస్తారు. ఆగం కాకుండా చాలా జాగ్రత్తగా ఓఎమ్ఆర్ను నింపాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ రాసేటప్పుడు టైం తెలిసేలా అలారమ్ బెల్ ఉంటుందా?
– రామారావు, బోధన్
కలెక్టర్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ప్రతి అర గంటకు ఒక బెల్‌ను రింగ్ చేస్తారు. అలాగే ఎగ్జామ్ ముగింపులో 5 నిమిషాల ముందు కూడా ఒకసారి బెల్ కొట్టడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ నిబంధనలే ఇందుకు ప్రామాణికం.
హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ సరిపోతుందా?
-అర్వింద్, కామారెడ్డి
టీఎస్పీఎస్సీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కలర్లో హాల్‌టికెట్ ఉంటే మంచిది. బ్లాక్ అండ్ వైట్ అయినప్పటికీ అనుమతి ఉంటుంది. ఇక సెంటర్లోకి వాచ్‌లు, డిజిటల్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. ప్రవేశ ద్వారం వద్దనే మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు ఉంటాయి.
ఎగ్జామ్ దగ్గర పడడంతో భయమేస్తుంది. భయం పోవాలంటే తక్షణం ఏం చేయాలి?
– జ్యోత్స్న
కలెక్టర్ : మీరు ఎదుర్కొనే గ్రూప్-1 పరీక్ష అనేది మీ జీవితాన్ని మార్చేసేది. మీ ఆశయం గొప్పదైనప్పుడు ఈ భయాలను వీడి స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో పరీక్షను రాయాలి. ఈ సమయంలో కొత్తగా చదవడం కన్నా రివిజన్ చేయడం, బేసిక్స్‌పై రివ్యూ చేసుకోవడం మంచిది.
ఓఎమ్ఆర్లో వివరాలను నింపడానికి ప్రత్యేకంగా సమయం ఉంటుందా?
– మమత
కలెక్టర్ : ప్రశ్నాపత్రానికి ఈసారి ప్రత్యేకంగా కోడ్‌ను ఇస్తున్నారు. ఆంగ్ల అక్షరాలు ఏ, బీ, సీ, డీ కాకుండా అంకెలను ఇస్తున్నారు. ఆ అంకెలను తప్పనిసరిగా ఓఎమ్ఆర్లో పేర్కొనాలి. బబుల్ చేయడంలో జాగ్రత్తలు పాటించండి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓఎమ్ఆర్ నకలు(మాడల్)ను పెట్టారు. అనుమానం ఉంటే వాటిని చూడొచ్చు.
మొన్న దసరాకు చేతికి మెహందీ పెట్టాను. ఇప్పుడది అలాగే ఉంది. ఎగ్జామ్‌కు అనుమతి ఉంటుందా? ఉండదా?
– ప్రత్యూష
కలెక్టర్ : పరీక్షకు ఇంకా సమయం ఉన్నందున చేతికి ఎలాంటి మరకలు లేకుండా జాగ్రత్త పడండి. మెహందీ అన్నది చేతికి ఉండడంతో బయోమెట్రిక్ హాజరులో వేలిముద్రలు సరిగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సెంటర్‌కు చేరుకోవాలి.
గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు ఒత్తిడిని తట్టుకోవడం ఎలా?
– రాజేందర్
కలెక్టర్ : రాష్ట్రస్థాయిలో అతి పెద్ద ఉద్యోగాలు గ్రూప్-1లోనే ఉంటాయి. ఇందులో కొలువు సాధిస్తే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇందుకోసం వేలాది మంది పోటీ పడతారు. సహజంగానే సీరియస్‌గా చదివిన వారికి టెన్షన్ ఉంటుంది. ఈ సమయంలో చదివింది రివిజన్ మాత్రమే చేసుకొని పరీక్షకు వెళ్లాలి. ప్రశాంతంగా ఉంటూ పరీక్షను ధైర్యంగా ఎదుర్కోవాలి.
ప్రిలిమ్స్ పరీక్షకు సమయ పాలన ఏ విధంగా పాటించాలి?
– శ్రీనివాస్, బీర్కూర్
కలెక్టర్ : వాస్తవానికి టీఎస్పీఎస్సీ ఆదేశాల మేరకు పరీక్ష సమయం ఉదయం 10.30 గంటలకు. నిబంధనల ప్రకారం ఉదయం 10.15 గంటలకే సరిగ్గా 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లను మూసేసి ఎవ్వరినీ లోనికి అనుమతించేది ఉండదు. అభ్యర్థులు రెండు గంటల ముందే సెంటర్‌కు చేరుకుంటే మంచిది. ఉదయం 8.30గంటలకే లోనికి ప్రవేశం ఉంది.
నా హాల్ టికెట్లో పేరు రాలేదు. పేరు స్థానంలో ఇతరత్రా వివరాలు నమోదు అయ్యాయి. ఇప్పుడు నేను ఏమి చేయాలి?
– సాయితేజ, వేల్పూర్
కలెక్టర్ : తప్పకుండా నీ సమస్యను తీరుస్తాం. పరీక్షకు సమయం ఉన్నందున టీఎస్పీఎస్సీ, నిజామాబాద్‌కు కేటాయించిన పర్యవేక్షకుల ద్వారా మీకు సహాయం అందిస్తాం. మొదటగా టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్‌కు ఫోన్ చేసి ఫిర్యాదును రిజిష్టర్ చేయించండి. తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. మీ మొబైల్‌కు మా కార్యాలయ సిబ్బంది కాల్ చేసి మా తరఫున చేయాల్సిన సహాయాన్ని మీకు అందిస్తాం. టెన్షన్ పడకండి.