పోస్ట్..
ఖాకీ చొక్కా వేసుకొని.. సైకిల్‌పై ఇంటింటికీ తిరుగుతూ పోస్టు అనే గొంతు మాయమైంది. మారుతున్న కాలానుగుణంగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విప్లవంతో ఈమెయిల్స్, వాట్సాప్ అందుబాటులోకి రావడంతో క్రమేణా తోకలేని పిట్ట కనుమరుగవుతున్నది. కాలం మారుతున్నా.. కొందరు మాత్రం ఉత్తరాలు రాయడం మానుకోలేదు. కాలానికి అనుగుణంగా తపాలా శాఖ సైతం సంస్థను కాపాడుకునేందుకు వివిధ రూపాల్లో ప్రజలకు సేవలందిస్తున్నది.
– ఇందూరు, అక్టోబర్ 8
ఉత్తరం అందుకోవడం, రహస్యంగా విప్పి చదువుకోవడం, ఎవరైనా వస్తుంటే దిండుకింద దాచుకోవడం ప్రేమికులకు ఖర్చులేని ఓ మధురానుభూతి. దూరంగా సైన్యంలోనో, మరోఉద్యోగంలోనో ఉన్న భర్త, కొడుకో ఉత్తరం రాస్తాడనీ, క్షేమ సమాచారం చెబుతాడనీ వీధి వంక చూ స్తూ గడిపే కాలం ఇంకా మధురమైనది. ఆధునిక కాలంలో సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు రాసుకునే తరం అంతరించిపోయింది. ఇంటికి వచ్చిన ఉత్తరాలను పొడవాటి ఇనుప కమ్మీకి గుచ్చి ఉంచడం, అవసరమైనప్పుడు మళ్లీ తీసి చదువుకోవడం రెండు, మూడు దశాబ్దాల క్రితం ప్రతి ఇంటా ఉండేది. ఆ రోజుల్లో చాలా తక్కువ ఖర్చుతో సమాచారాన్ని దూరతీరాల్లోని ఆత్మీయులకు చేరవేయడానికి తపాలా రంగం అందించిన సేవలు వెలకట్టలేనివి. అలాంటి పోస్టల్ శాఖకు సంబంధించి ప్రతి ఏడాది అక్టోబర్ 9న ప్రపంచ, 10న జాతీయ తపాలా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
పోస్టల్ డే ఏర్పడిందిలా..
గతంలో సమాచార మార్పిడికి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు పోస్టుకార్డే ప్రధాన ఆధారంగా ఉండేది. కాలగమనంలో వచ్చిన మార్పులు దీనిపై పెనుప్రభావం చూపాయి. ప్రస్తుతం పోస్టుకార్డు మనుగడ కోసం పోరాడుతున్నది. సెల్ఫోన్లు, కం ప్యూటర్లు, సోషల్ మీడియా ఇతర సాంకేతిక సాధనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని అవసరం తగ్గిపోయింది. ఈ- మెయిల్స్ చాలా వరకు ప్రస్తుతం పోస్టుకార్డు పాత్రను పోషిస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఇప్పటికీ పోస్టుకార్డునే వినియోగిస్తున్నారు.
చరిత్రలోకి వెళ్తే మెసేంజర్ రూపంలో తపాలా సర్వీసులుండేవి. వీళ్లు నడిచి లేదా గుర్రాళ్ల మీద వెళ్లి రాతప్రతుల్ని చేరవేసేవారు. 1600-1700 సంవత్సరాల్లో అనేక దేశాల వారు జాతీయ తపాలా వ్యవస్థను నెలకొల్పుకొని ఆయా దేశాల నడుమ తపాలా సౌకర్యాల్ని అందించుకునేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. 1878లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌గా మారింది. ఇది 1948లో ఐక్యరాజ్య సమితికి ప్రత్యేక ఏజెన్సీగా రూపాంతరం చెందింది. 1969 అక్టోబర్ 1 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు జపాన్ టోక్యోలో అనేక సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రతినిధులు అక్టోబర్ 9వ తేదిన వరల్డ్ పోస్టల్ డేను నిర్వహించాలని తీర్మానించారు.
పోస్టల్ సేవలు
ఉత్తరాల పంపిణీ, స్పీడ్ పోస్టు, ఈ పోస్టు సర్వీసు, ఆధార్ నమోదు, ఆలయాల ప్రసాదాల సర్వీసు, గోదావరి జలాలు అందజేసే సర్వీసు తదితర సేవలు అందిస్తున్నది. కనిష్ఠ, గరిష్ఠ పెట్టుబడి పథకం, టైం డిపాజిట్, సుకన్య సమృద్ధి ఖాతా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, నెలవారీ ఆదాయం వంటి పథకాలు అమలు చేస్తున్నది.
35ఏండ్లుగా స్టాంపుల సేకరణ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన మాడవేడి లక్ష్మణ్ పవన్‌కుమార్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. డిచ్పల్లి మండలం అమృతాపూర్ ఎంపీపీఎస్ హెచ్ఎంగా సేవలందిస్తున్నారు. చిన్ననాటి నుంచి లక్ష్మణ్ పవన్‌కుమార్ స్టాంపులు సేకరణ హాబీగా ఎంచుకున్నారు. తండ్రి లక్ష్మణ్ గిరిరాజ్ కళాశాలలో స్టోర్ కీపర్‌గా పనిచేసే సమయంలో స్టాంపుల సేకరణ చేయగా తండ్రిని చూసి తాను కూడా హాబీగా అలవర్చుకున్నారు. 35 ఏండ్లుగా దేశ, విదేశాలకు చెందిన 5000 స్టాంపులను సేకరించారు.
ప్రపంచ తపాలా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ తపాలా కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 11న నిర్వహించే తపాలా స్టాంపుల ప్రదర్శనలో పాల్గొననుండడం విశేషం. రెండు పైసల స్టాంపులు, 3 పైసల స్టాంపులు, 5 పైసల స్టాంపులు, మన దేశంలోని స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, మేధావులు, సినీ నటులు, క్రీడాకారులు, కళాకారులు, చారితాత్మ్రక కట్టడాలు, పక్షులు, జంతువుల తపాలా బిల్లలు, మినీ ఓచర్స్, ఫస్ట్‌డే కవర్లు, బ్రోచర్లను సేకరించారు. తాను ఏ పాఠశాలలో పని చేసినా విద్యార్థులకు తపాలా స్టాంపుల ప్రదర్శన ఇవ్వడంతోపాటు వాటి గురించి వివరించడం విశేషం.