1874 అక్టోబరు 9… అంటే సరిగ్గా 148 ఏండ్ల క్రితం… ఇదే రోజున నగరానికి చెందిన ప్రముఖులంతా ఒకే చోటున ఉన్నారు. వీరికి దూరంగా సాధారణ ప్రజలు గుంపులుగా ఉండి ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే దూరంగా గుప్పుమంటూ పొగ కనిపించింది. అంతే ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. గుప్పుమంటూ పొగతో వచ్చిన అతిథి ఎవరో కాదు..కూ.. చుక్.. చుక్.. అంటూ వచ్చిన రైలు. భాగ్యనగరం తొలిసారిగా రైలును చూసి మురిసిపోయిన రోజది. సికింద్రాబాద్ – వాడీ మధ్య నడిచే ఆ రైలే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమైన తొలి రైలు. అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ కూడా అందుబాటులోకి రావడం విశేషం.
– సికింద్రాబాద్, అక్టోబర్ 8
హైదరాబాద్ స్టేట్… ముత్యాల నగరంగా దేశంలోనే సుసంపన్నమైన రాష్ట్రం. బ్రిటిష్ వలస పాలనకు దూరంగా, నిజాం రాజుల ఏలుబడిలో ఎదిగిన ఈ సంస్థానంలో ప్రతీది ప్రత్యేకమే. సొంత కరెన్సీ, పోస్టల్, ఎయిర్వేస్కు తోడు సొంత రైల్వే వ్యవస్థ కూడా ఉండేది. ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ హయాంలో 1870లో నిజామ్స్ స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో ‘ది నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే’గా మారింది. ఇది 1951లో జాతీయమై భారత రైల్వేలో విలీనమైంది.
సొంత రైల్వే వ్యవస్థ..
దేశవ్యాప్తంగా బ్రిటీష్ ఇండియా రైల్వే సంస్థ రైల్వే వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటే దానికి భిన్నంగా సొంతంగా రైల్వేను ఏర్పాటు చేసిన ఘనత హైదరాబాద్‌కే దక్కింది. హైదరాబాద్ స్టేట్‌ను భారత్‌లోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించాని కర్ణాటకలోని బ్రిటీష్ రైల్వే జంక్షన్ వాడీ నుంచి తొలిలైన్ను సికింద్రాబాద్ వరకు 1870లో పనులు మొదలయ్యాయి. 1874 నాటికి పనులు పూర్తయ్యాయి. వాడీ రైల్వే స్టేషన్ నుంచి 1874 అక్టోబర్ 9న ప్రారంభమైన గూడ్స్ రైలు 184 కిలోమీటర్లు ప్రయాణించి భాగ్యనగరానికి చేరుకున్నది.
ఇలా హైదరాబాద్‌లో రైలు ప్రస్థానం ప్రారంభమై నేటికి సరిగ్గా 148 ఏండ్లు నిండాయి. అదే ఏడాది అదే నెలలో హైదరాబాద్ నుంచి తొలి ప్యాసింజర్ రైలు మూడు బోగీలు, 150 మంది ప్రయాణికులతో నిజాం స్టేట్ రైల్వే ట్రాక్‌పై పరుగులు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్వే ఇది. దీనికి అనుబంధ కంపెనీగా 1898లో హైదరాబాద్-గోదావరి వ్యాలీ రైల్వేను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి 235 కిలోమీటర్ల మేర లైన్‌ను నిర్మించి 1881లో సింగరేణిలోని ఇల్లందు వరకు అనుసంధానించారు.1889లో ఆ లైన్‌ను విజయవాడ వరకు పొడిగించారు.
దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రబిందువుగా..
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రధాన లైన్లు, జంక్షన్లు, స్టేషన్లు నిజాం హయాంలో నిర్మించినవే. హైదరాబాద్‌ను ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే రైల్వే లైన్ పనులన్నీ 19వ శతాబ్దంలోనే పూర్తయ్యాయి. 1951 నాటికి 2,353 మేర కి.మీ పట్టాలను పరిచారు. నిజాం స్టేట్ రైల్వేను 1950లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెంట్రల్ రైల్వేలో విలీనం చేసింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేగా మారిపోయింది. భారతీయ రైల్వే కేంద్రాల్లో ఎక్కువగా ఆదాయం వస్తున్న మార్గాల్లో ఎస్సీఆర్ కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ స్టేషన్‌ను 1874లో నిర్మించగా.. హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్‌ను 1907లో, కాచిగూడ రైల్వేస్టేషన్‌ను 1916లో ప్రారంభించారు. ఒకటి, రెండు రైళ్లతో.. వారానికొకటి, రెండు ట్రిప్పులతో మొదలైన హైదరాబాద్ రైల్వే ప్రయాణం నేడు అజరామరంగా వెలుగొందుతున్నది.