బాన్సువాడ టౌన్, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంతోపాటు బాన్సువాడ పట్టణంలోని చావిడి, హరిజనవాడ, శ్రీరామ కాలనీ, సంగమేశ్వర చౌరస్తా, చైతన్య కాలనీ, తాడ్కోల్ డబుల్ బెడ్రూం ఇండ్ల తదితర కాలనీల్లో సోమవారం సద్దుల బతుకమ్మ సంబురాలు నిర్వహించగా.. స్పీకర్ పాల్గొన్నారు. ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటూ మంచి జీవితాన్ని ప్రసాదించాలని పరమేశ్వరి దేవీని కోరుకుంటారని తెలిపారు. బతుకునిచ్చే అమ్మను బతుకమ్మ అని, అందుకే మనం ఇంత ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకొంటున్నామని అన్నారు. శ్రీరామ కాలనీలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని కాలనీవాసులు సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం రాష్ట్ర ప్రజలకు ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ, బుడ్మి విండో చైర్మన్లు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఎజాస్, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురువినయ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, స్పీకర్ వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.