బీర్కూర్/ కోటగిరి, సెప్టెంబర్ 24 : సహకార సంఘాలకు రైతులే యజమానులని, చైర్మన్లు రైతుల ప్రతినిధులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల కంట కన్నీళ్లు రాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో రూ.42 లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనం, గిడ్డంగిని శనివారం ఆయన ప్రారంభించారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అనంతరం కోటగిరి మండలంలోని కల్లూర్‌లో రూ.కోటీ 50లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. బర్దీపూర్, లింగాపూర్‌తో పాటు కల్లూర్ గ్రామం, గన్నారం చౌరస్తా వద్ద పలువురికి కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన చెక్కులతోపాటు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో సభాపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 906, ఉమ్మడి జిల్లాలో 144 సహకార సంఘాలు ఉన్నాయని తెలిపారు. గతంలో సహకార బ్యాంకు రుణాల కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. అప్పు, విత్తనాలు, ఎరువుల కోసం, ధాన్యం అమ్ముకోవడానికి ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయించేవారని గుర్తుచేశారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసి అన్ని రకాల సేవలు ఒకే చోట లభ్యమయ్యేలా రూపొందించినదే సహకార సంఘాల వ్యవస్థ అని వివరించారు. రైతులు సంతోషంగా పంటలు పండించేలా సహకారాన్ని అందించాలన్నారు. పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకుల నుంచి అప్పులు చేయడం కాదని, తమ లాభాలను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా లాభం వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు. ఎంత కష్టమైనా నష్టమైనా రైతులు పండించిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందన్నారు.
ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరెలను కానుకగా అందిస్తోందని స్పీకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తం గా కోటి మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తోందన్నారు. చెల్లెకు, అక్కకు అన్నగా సీఎం కేసీఆర్ కానుకగా పంపించారన్నారు. ధర ముఖ్యం కాదని ప్రేమతో ఇవ్వ డం ముఖ్యం అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో లక్ష మందికి చీరెలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా దామరంచ వాగుపై వంతెనను పూర్తి చేస్తామన్నారు. బ్రిడ్జి పూర్తి అవడమే ఆలస్యం వంతెన నుంచి చింతల నాగారం వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ వరకు బీటీ రోడ్డుకు రూ. 60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దసరా నుంచి సొంత స్థలం ఉన్నవారికి రూ. 3లక్షల సింగిల్ బెడ్ రూం ఇండ్ల పథకం రానున్నదని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే అత్యధికంగా పదివేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. మరో 5వేల ఇండ్లు మంజూరు కానున్నాయని చెప్పారు. కుల,మతాలకు అతీతంగా పేదలందరికీ ఇండ్లను మంజూ రు చేస్తామన్నారు.
బీర్కూర్ మండలం దామరంచలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, డీసీవో వసంత, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, సర్పంచ్ విఠల్, వైస్ ఎంపీపీ కాశీరాం, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, వైస్ చైర్మన్ గంగారాం, సొసైటీ చైర్మన్లు ఎర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, దివిటి శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.కోటగిరి మండలం కల్లూర్ సమావేశంలో జడ్పీటీసీ శంకర్‌పటేల్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్‌పటేల్,లసర్పంచ్ వోలే లక్ష్మీ లింగప్ప, లింగాపూర్ సర్పంచ్ దేగం హన్మంతు, ఎంపీటీసీలు సుజాతా వెంకట్‌రెడ్డి, సరితా మారుతి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, రాంరెడ్డి, సొండే లింగప్ప, మండల కన్వీనర్ ఎజాజ్‌ఖాన్, తేళ్ల అరవింద్, బర్ల మధు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.