ఇందూరు, సెప్టెంబర్ 17: విశ్వబ్రాహ్మణ కులస్తుల సమస్యలను ప్రభ్వుం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపుతూ వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వపరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్కు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పలు సమస్యలను నివేదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.
ఇటీవలి కాలం వరకు కూడా గ్రామాల్లో ప్రతి శుభప్రదమైన పని కోసం ప్రజలు విశ్వబ్రాహ్మణులపైనే ఆధారపడేవారని, పల్లెల్లో వారికి ఎంతో ప్రాధాన్యత ఉండేదన్నారు. విశ్వబ్రాహ్మణులు అంటేనే మంచి వ్యక్తిత్వం కలిగిన వారు అనే గౌరవభావం ఇప్పటికీ ప్రజల్లో నెలకొందన్నారు. మారుతున్న కాలానుగుణంగా సమాజంలో ఆధునిక పోకడలు సంతరించుకుని పారిశ్రామికత పల్లెల వరకు విస్తరించడంతో విశ్వకర్మలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన మాట వాస్తవమేనని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అన్ని చేతి వృత్తుల వారు, ఇతర అన్ని రంగాల వారు కూడా ఎదుర్కొక తప్పడం లేదని గుర్తు చేశారు.
దీనిని అధిగమించేందుకు వీలుగా మారిన పరిస్థితులకు తగినట్లుగా మనకు మనం మార్పు చెందాల్సిన అవసరముందని, ఆధునికత దిశగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విశ్వబ్రాహ్మణులు ఎదర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో ఘనంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి నర్సయ్య, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పరిపూర్ణాచారి, రామ్మోహనాచారి పాల్గొన్నారు.