రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేయనున్న 80వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సీఎం కేసీఆర్ చొరవతో 95శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయని, జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. వేల్పూర్‌లోని మంత్రి నివాసంలో సీపీ నాగరాజుతో కలిసి ఉచిత శిక్షణకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా కృషి చేశారనన్నారు. దీంతో జిల్లాలోనూ 1978 ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని మంత్రి తెలిపారు. పోలీస్ శాఖలోనే 1000 కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనున్నదని వివరించారు. సీపీ నాగరాజు పర్యవేక్షణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ శిబిరం ప్రారంభిస్తామని, కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం అర్హత కలిగిన యువతకు వీడియోల ద్వారా మెరుగైన శిక్షణ అందుతుందని, సొంత ఖర్చులతో ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, తహసీల్దార్ సతీశ్ రెడ్డి, ఏర్గట్ల ఎంపీపీ ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, టీయూ ఈసీ మెంబర్ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.