కొత్త కలెక్టరేట్లో కార్యకలాపాలు షురూ అయ్యాయి. కొత్త భవనాన్ని సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించగా భవనంలోకి వివిధ శాఖల నుంచి సామగ్రి తరలింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నోఏండ్లుగా అనేక ప్రభుత్వ శాఖలు విసిరేసినట్లుగా ఉండేవి. ఒక కార్యాలయం నుంచి మరో ఆఫీసుకు వెళ్లాలంటే అదో ప్రహసనం.. ప్రస్తుతం అన్ని శాఖలు ఒక్క దగ్గరికి తేవడంతో ప్రజలకు ఇబ్బందులు దూరం కావడంతో పాటు అధికారుల పర్యవేక్షణ సులువు కానున్నది. ముఖ్య శాఖలైన సహకార , జిల్లా పంచాయతీ అధికారి, మైనింగ్, డీఈవో, ఇంటర్మీడియెట్, అటవీ శాఖ అధికారి, భూగర్భ జల వనరులు, మత్స్య శాఖ, దేవాదాయ, ఉద్యాన వన, భూమి కొలతలు, పరిశ్రమల కేంద్రం, కార్మిక శాఖ వంటి కార్యాలయాలన్నీ ఒక చోటుకు చేరాయి. కొత్త కార్యాలయంలో పరిపాలన ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉద్యోగులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. ఇన్ని రోజులు వివిధ శాఖలు అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కొనసాగగా ఇప్పుడు ఉపశమనం లభించింది.
నిజామాబాద్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్ నగరంలోని కొత్త కలెక్టరేట్లో పాలనా ప్రక్రియ షురూ అయ్యింది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోకి ఆయా శాఖలు వచ్చి చేరాయి. ఉద్యోగులంతా నూతన భవంతిలో కొత్త అనుభూతిని పొందుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన పాత కలెక్టరేట్లోని ఇరుకు గదుల్లో ఇబ్బందులకు గురైన వారందరికీ ఇప్పుడు ఉపశమనం లభించింది. అరకొర వసతులతో కిరాయి గదుల్లో కొనసాగిన శాఖలకూ విముక్తి కలిగింది. ముఖ్యమైన శాఖలకు నూతన కలెక్టరేట్లో కార్యాలయాలను కేటాయించడంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం సులువు కానుంది. సహకార శాఖ, డీపీవో, మైనింగ్, విద్యాశాఖ, అటవీ శాఖ, భూగర్భ జల వనరులు, మత్స్య శాఖ, దేవాదాయ, ఉద్యానవన శాఖ, సర్వే ల్యాండ్స్, పరిశ్రమల కేంద్రం, కార్మిక శాఖ వంటి కార్యాలయాలన్నీ ఇప్పడు కొత్త కలెక్టరేట్లోనే ఉన్నాయి. ఇన్ని రోజులపాటు నగరంలో విసిరేసినట్లుగా ఉన్న శాఖలు ప్రస్తుతం ఒకే గొడుగు కిందకు వచ్చాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇన్ని రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడో విసిరేసినట్లుగా ఉండేవి. కిరాయి గదుల్లో కార్యకలాపాలు జరిగేవి. కొన్ని ముఖ్యమైన శాఖలైతే ఎక్కడున్నాయో కూడా అడ్రస్ తెలియని దుస్థితి ఉండేది. మరికొన్ని ఆఫీసులను రిమోట్ ఏరియాల్లో భవనాలను కిరాయికి తీసుకొని తూతూ మంత్రంగా కొనసాగించేవారు. ఇప్పుడు ఇవన్నీ సమీకృత భవనంలోకి మార్చడం ద్వారా జవాబుదారీతనం కోల్పోయిన శాఖలపై కలెక్టర్‌కు పట్టు రానుంది. కలెక్టర్, అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగుల పనితీరుపై ఓ నిఘా ఉండే అవకాశముంది. ఉద్యోగుల్లోనూ బాధ్యత పెరుగనుంది. పాత భవనంలో ఇతర శాఖలకు సంబంధం లేకుండా కలెక్టర్ చాంబర్ ఉండేది. ఇప్పుడు సర్వాంగ సుందరంగా ముస్తాబైన నూతన భవనంలో ఆయా శాఖలకు శాస్త్రీయబద్ధంగా ఆఫీసులను కేటాయించారు. ఏ శాఖ ఎక్కడ ఉన్నదో సులభంగా తెలిసేలా నేమ్ ప్లేట్‌ను సైతం ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్దనే సూచిక బోర్డులో ఆఫీసుల వివరాలను పొందుపర్చారు.
జీ ప్లస్ 2 అంతస్తులతో నిర్మించిన కొత్త భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే కలెక్టర్, అదనపు కలెక్టర్లకు(రెవెన్యూ/స్థానిక సంస్థలు), పక్కపక్కనే ప్రత్యేక చాంబర్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రజల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు, సమీక్షా సమావేశాల కోసం రౌండ్ టేబుల్‌తో మీటింగ్ హాల్‌ను కలెక్టర్ చాంబర్‌కు అనుబంధంగా ఏర్పాటు చేశారు. జిల్లా పంచాయతీ అధికారి, ట్రెజరీ, టీ ఫైబర్ ఆఫీస్, సంక్షేమ అధికారి, పౌర సంబంధాల అధికారి కార్యాలయాలతో పాటు సమావేశ మందిరం గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉన్నాయి.
జిల్లా వ్యవసాయ శాఖ, ఆత్మ కార్యాలయం, ఎస్సీ కులాల సహకార అభివృద్ధి సంస్థ, ఎస్సీ కులాల సహకార అభివృద్ధి శాఖ కార్యాలయం, విద్యాశాఖాధికారి, మైనారిటీ, జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయం, గనులు, భూగర్భ శాఖ కార్యాలయం, భూగర్భ జలాల శాఖ అధికారి కార్యాలయం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కార్యాలయం, పౌరసరఫరాల సంస్థ, పౌరసరఫరాల శాఖ కార్యాలయం, ఎస్టీ అభివృద్ధి కార్యాలయాలకు గదులను కేటాయించారు.
రెండో అంతస్తులో జిల్లా వైద్యారోగ్య శాఖ, రోడ్లు, భవనాల శాఖ, ఆడిట్ కార్యాలయం, ఉద్యాన వన, పట్టు పరిశ్రమ శాఖ, దేవాదాయ శాఖ, మత్స్యశాఖ, మిషన్ భగీరథ కార్యాలయాలు ఉన్నాయి. వీటితోపాటు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఇంటర్మీడియెట్ విద్యాధికారి, కార్మిక శాఖ, లీగల్ మెట్రాలజీ, అటవీశాఖ అధికారి, భూమి కొలతల శాఖ, జిల్లా పరిశ్రమల కేంద్రం, వయోజన విద్య, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పోలిస్తే నిజామాబాద్ నూతన కలెక్టరేట్లో శాఖలకు కేటాయించిన ఆఫీస్ స్పేస్ ఎక్కువగా ఉన్నది. ఆయా శాఖల కార్యకలాపాలు, సిబ్బంది, ప్రజల సందర్శనను పరిగణలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా స్పేస్‌ను కేటాయించారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఎక్కువగా ఆఫీస్ స్పేస్‌ను కల్పించారు. నిజామాబాద్ నగరంలో చెట్టుకొకటి, పుట్టకొకటి అన్నట్లుగా ఉన్న ఆఫీసులకు ప్రస్తుతం శాశ్వత కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. సమీకృత కలెక్టరేట్‌తో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా మరింది.
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు, ఆలోచన భవిష్యత్తు తరాల మేలు కోసమే. వివక్షకు గురైన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరిపాలనా వికేంద్రీకరణకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతి కొత్తజిల్లాలో సమీకృత కలెక్టరేట్లను మంజూరు చేసింది. వాటిని సీఎం కేసీఆర్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నారు. అందులో పాతజిల్లా నిజామాబాద్‌కు సైతం కలెక్టరేట్ మంజూరు కావడం సంతోషకరం. కేసీఆర్ ఆలోచనలకు అద్దం పట్టినట్లు రాష్ట్రమంతటా ఒకే నమూనాలో సమీకృత కలెక్టరేట్లను నిర్మించాం. ఇంత పెద్దఎత్తున కలెక్టరేట్ల నిర్మాణం జరుగుతున్న సమయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉండడం నా అదృష్టం. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు రావడంతో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
– వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి