రుద్రూర్, సెప్టెంబర్ 9 : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఆపై తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి పోశెట్టి (35) భార్య సావిత్రికి అదే గ్రామానికి చెందిన బట్టు శ్రీనివాస్‌తో చాలారోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ క్రమంలో తన భర్త పోశెట్టి మూడు రోజులుగా కనిపించడం లేదంటూ భార్య సావిత్రి సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలను సేకరించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో పోశెట్టి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో బట్టు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోశెట్టిని భార్య సావిత్రి ప్రోత్సాహంతో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోశెట్టి మద్యం సేవించి తనను రోజూ కొడుతున్నాడని సావిత్రి.. ప్రియుడు శ్రీనివాస్‌తో చెప్పేది. దీంతో ఆయనను హతమార్చాలని పథకం రచించారు. ఈ నెల 2వ తేదీన సాయంత్రం పోశెట్టికి శ్రీనివాస్ కల్లు తాగించాడు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి మరోసారి మద్యం తాగించి నీటిలోకి తోసేశాడు. మద్యం మత్తుతోపాటు ఈత రాకపోవడంతో పోశెట్టి ఊపిరాడక నీట మునిగి మృతిచెందాడు. పోశెట్టి హత్య వెనుక భార్య సావిత్రితోపాటు ఆమె తల్లి తంగెల్ల చంద్రభాగ ప్రోత్సాహం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు.