నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ నూతన శోభను సంతరించుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాలు సందడిగా మారాయి. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సోమవారం సీఎం కేసీఆర్ ప్రారంభించగా, ఆ రోజు నుంచే కార్యకలాపాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాత కలెక్టరేట్లోని ఫైల్స్, సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో మంగళవారం న్యూ కలెక్టరేట్‌కు తరలించారు. ఒక్కో విభాగానికి సంబంధించిన ఫైళ్లను వారికి కేటాయించిన గదుల్లో సర్దుకుంటున్నారు. దీంతో సిబ్బంది బిజీబిజీగా మారారు. కొన్నిశాఖలకు సంబంధించి ఫర్నిచర్ సిద్ధం చేస్తుండడంతో రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఫైళ్లను తరలించి సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సేవలు ఒకేచోట నుంచి లభించనుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
-ఇందూరు, సెప్టెంబర్ 6