నిజామాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కరోనా వైరస్ విస్తృతితో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల భారం మోయలేక చాలా మంది సతమతమయ్యారు. ఒకానొక దశలో ప్రైవేటుకు గుడ్ బై చెప్పి సర్కారు బడులకు సై అన్నారు. ఉచితంగా అందే విద్యాబోధనకు జైకొట్టడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగింది. 2021-22 విద్యా సంవత్సరంలో గతానికి భిన్నంగా ప్రభుత్వ స్కూళ్లలో సంఖ్య అత్యధికంగా నమోదైంది. వివిధ కారణాలతో ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా ప్రజలంతా కోరుకుంటున్న ఆంగ్ల మాధ్యమ బోధనకు సర్కారు తీవ్రంగా కృషి చేస్తున్నది. తాగునీరు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్వచ్ఛతకు చిరునామాగా నిలిచేలా ప్రాంగణాలను తీర్చిదిద్ది కార్పొరేట్ స్థాయి హంగులను అద్దేందుకు సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారు. ఇందుకోసం మన ఊరు-మన బడి, మన బస్తీ- మనబడి పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా జిల్లాలో 407 పాఠశాలల్లో మొదటి దశలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల్లో సర్కా రు బడి అంటే నమ్మకం ఏర్పడేలా విద్యాశాఖ పని చేస్తుండడంతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నది.
హోదాగా మారిన ఇంగ్లిష్ మీడియం..
ఇంగ్లిష్ మీడియంలో చదివించడం సమాజంలో హోదాగా మారింది. పిల్లలను ఇంగ్లిష్‌లో చదివించకపోతే ఉద్యోగాలు రావేమో అన్న భావన తల్లిదండ్రుల్లో నెలకొన్నది. సంపన్నులు, ఉన్నతవర్గాల పిల్లలతోపాటు పేదలు ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నారు. ఇందుకోసం ఏడాదంతా కష్టపడి సంపాదించిన సొమ్మును ఫీజులకు చెల్లిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ల నుంచి సర్కారు బడులకు లక్షలాది మంది చేరారు. వారు వెనక్కి వెళ్లకుండా వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఉపాధ్యాయులకు తొమ్మిది వారాల పాటు దీర్ఘకాలిక శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ, అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఈ ట్రైనింగ్‌ను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. రెండు దశల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 2022-23 విద్యా సంవత్సరంలో కొంగొత్తగా ప్రభుత్వ బడులన్నీ రూపాంతరం చెందనున్నాయి.
విద్యాభివృద్ధికి దోహదం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం విద్యాభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వ బడులకు ఆయువు పోసినట్లు అవుతుంది. మాటివ్వడంతోపాటుగానే నిజామాబాద్ జిల్లాలో 407 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వడం, పనుల గుర్తింపు ప్రక్రియ చేపట్టడం ఆహ్వానిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం ద్వారా వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉంది.
– వినోద్, బీసీ ఉపాధ్యాయ సంఘం, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
పక్కా ప్రణాళికతో..
ఇంగ్లిష్ మీడియం బోధనకు జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలను 17 కేంద్రాల్లో నిర్వ హిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రస్థాయి శిక్షణను ముగ్గురు, జిల్లాస్థాయిలో 60 మంది శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యాలు పెంపొందించుకునేలా శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నాం.
– రాజు, డీఈవో, కామారెడ్డి
ప్రభుత్వ ఆలోచనలు అద్భుతం…
మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టబోతున్న పనులు అద్భుతమైనవి. గతంలో ఏ ప్రభుత్వాలూ తీసుకోని శ్రద్ధాసక్తులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చూపుతున్నారు. ప్రభుత్వ బడులన్నింటినీ ప్రైవేటుకు దీటుగా మార్చేందుకు రూ.వేల కోట్లు వెచ్చించి రూపాంతరం చెందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. పేద, మధ్య తరగతి కుటుంబాల చెంతకే నాణ్యమైన విద్య చేరుతున్నది.
– మోహన్ రెడ్డి, పీఆర్టీయూ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు