నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమాల గడ్డ నిజామాబాద్ జిల్లా మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. ఉద్యమ ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలిచిన ఇక్కడి నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన చేశా రు. జాతీయ రాజకీయాలపై పలు వేదికలపై సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటన చేసినప్పటికీ… సోమవారం నిజామాబాద్ జిల్లాలో జరిగిన సభా వేదికపై బీజేపేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశమంతా ఉచి త కరెంట్ అమలు చేస్తామని చెప్పడంపై ఆసక్తి ఏర్పడిం ది. ఇందుకు ప్రజల సమ్మతిని, వారి ఆంక్షను, ఆశీర్వాదాన్ని సీఎం కేసీఆర్ వినమ్రంగా కోరగా అందుకు లక్షలాది మంది ప్రజలు అదే రీతిలో మద్దతు తెలిపారు. విజయ సంకేతం చూపుతూ, హర్షధ్వానాలతో కేసీఆర్‌కు అండగా ఉన్నట్లు ప్రకటించారు.
నిజామాబాద్ నగరంలో ని జీజీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన సభ దిగ్విజయం తో కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా ఉమ్మ డి జిల్లా భారీ బహిరంగ సభ జరిగింది. కేసీఆర్ సభకు 9 నియోజకవర్గాల నుంచి జనం తండోపతండాలుగా తరలి వ చ్చారు. కేసీఆర్ ప్రసంగం సభికులందరినీ ఆకట్టుకున్నది.
బ్రహ్మరథం పట్టిన ప్రజలు…
టీఆర్ఎస్ పార్టీ సభతో మరోమారు నిజామాబాద్, కా మారెడ్డి నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఇందూర్ గడ్డ పులకించింది. మధ్యాహ్నం జరిగిన సీఎం కేసీఆర్ ప్రసంగానికి రెండు గంటల ముందే జనమంతా వేదికకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సమన్వయంతో పోలీస్ శాఖకు అందించిన సలహాలు, సూచనలతో ట్రాఫిక్ చిక్కులు కనిపించలేదు.
చారిత్రక సందర్భం ఆవిష్కృతం…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్‌గా పరిగణిస్తుంటారు. 2001లో పార్టీ పురుడు పోసుకున్న తొలి నాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుపు విజయాలను ఈ ప్రాంత ప్రజలే టీఆర్ఎస్కు అందించారు. తెలంగాణ ప్రాంతంపై ఆంధ్రా పెత్తందారుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన టీఆర్ఎస్ పోరాటానికి ఊరూరా మద్దతు దక్కింది. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను వివరిస్తూ ఊరూరా తిరుగుతూ కేసీఆర్ ఆనాడు చేసిన పర్యటనలు చరిత్రలో నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ సారథ్యంలో జరిగిన అనేక ఎన్నికల్లోనూ మరుపురాని విజయాలను ప్రజ లు అందించారు. ప్రతి ఎన్నికల్లోనూ గెలుపును సొంతం చేసుకుంటూ కంచుకోటగా ఇందూరు గడ్డ మారింది. టీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన నిజామాబాద్ గడ్డపై నుంచి బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశమంతా 2024లో ఫ్రీ కరెంట్‌ను అమలు చేస్తామని ప్రకటించడం తో మరో చారిత్రక సందర్భానికి ఇందూరు వేదికగా మారింది.
ఒకే చోటుకు ఉమ్మడి జిల్లా ప్రజలు…
రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2016లో అధికార వికేంద్రీకరణలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలను విభజించారు. ఆ తర్వాతి కాలం నుంచి పాత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు ఉమ్మడిగా నిర్వహించడం అరుదుగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా జనాలను తరలించి సభలు నిర్వహించడం సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడే చోటు చేసుకుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఏకంగా లక్షలాది మంది నలు దిశల నుంచి సభా వేదికకు చేరుకున్నారు. జీజీ కాలేజీలో జనమంతా కిక్కిరిసి కనిపించింది. బీజేపీ దుష్ట రాజకీయాలపై గులాబీ అధినేత సంధించిన బాణాలు అందరిలోనూ ఆలోచింపజేశాయి.