నవీపేట, మార్చి 17: నవీపేట మేకలు, కూరగాయల సంత వేలం మళ్లీ వాయిదా వేశారు. గురువారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఉప సర్పంచ్ కరిపే మల్లేశ్ అధ్యక్షతన మేకలు, కూరగాయల సంతకు వేలం నిర్వహించారు. కనీస ధర రాకపోవడంతో వేలాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు గ్రామ కార్యదర్శి వెంకట్మ్రణ ప్రకటించారు. గతేడాది మేకల సంతను రూ.43.12 లక్షలకు నవీపేటకు చెందిన ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఈ నెల 15వ తేదీన మొదటిసారి వేలం నిర్వహించగా నవీపేటకు చెందిన షేక్ సలీమ్ రూ.33.26 లక్షలు, గురువారం రెండోసారి వేలం నిర్వహించగా కేవలం రూ.25 వేలు మాత్రమే పెంచి అదే వ్యాపారి రూ.33.51లక్షలకు పాడాడు. దీంతో పంచాయతీకి 10 శాతం పెంచిన లెక్క ప్రకారం జీపీ కి రూ.48 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. ఆదాయం రాక పోవడంతో సంతను మళ్లీ వాయిదా వేస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. కూరగాయల సంతకు వేలంలో రూ.10.60 లక్షలకు మాత్ర మే పెంచారు. వేలంలో పాడడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోమారు వాయి దా వేస్తున్నట్లు గ్రామ కార్యదర్శి పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన మేకల సంత వేలం లో 51 మంది రూ.లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించి పాల్గొనగా, కూరగాయల సంతకు నిర్వహించిన వేలంలో 18 మంది పా ల్గొన్నారు. సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, ఎంపీపీ రామకృష్ణ, జీపీ పాలక వర్గ సభ్యులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జీపీ ఆదాయానికి భారీ గండిపడే ప్రమాదం..
ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన నవీపేట మేకల సంతకు ఏడాదికి రూ. కోటిన్నరకు పైగా ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో గతేడాది నవీపేటకు చెందిన ఓ వ్యాపారి మేకల సంతను రూ.43.12 లక్షలకు దక్కించుకోగా, కూరగాయల సంతను అదే కుటుంబానికి చెందిన మరొకరు రూ.13.26 లక్షలకు దక్కించుకున్నాడు. వేలంలో ఒక్కరే పాల్గొని మిగతావారితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని సంతను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో పంచాయతీ లక్షల రూపాయల్లో ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.