విద్యానగర్, ఆగస్టు 11 : హిందూ సంప్రదాయ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది రాఖీ పౌర్ణమి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణిమను శ్రావణ పౌర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణిమ లేదా రాఖీ పౌర్ణిమ లేదా రక్షాబంధన్ అని అంటారు. దీనినే సంస్కృతంలో రక్షికా పౌర్ణిమ అంటారు.రక్ష అనగా సంరక్షణ అని అర్థం. దీంతో పాటు జంధ్యధారణకు ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున నూతన జంధ్యాన్ని ధరించడం ద్వారా దివ్యమైన తేజస్సు లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు.అన్నాచెల్లెళ్ల ఆత్మీయత, అనుబంధాన్ని చాటి చెప్పే రాఖీ పండుగ అత్యంత ప్రత్యేకమైనది. సోదరీమణులు,వారిసోదరులకు రాఖీలను కట్టి ఆత్మీయతను చాటిచెప్పే పండుగ. రాఖీని కట్టుకున్న తర్వాత తమ సోదరీమణులకు బహుమతుల ద్వారా తమ ప్రేమను చాటుతారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.రెండు మూడు రోజుల నుంచే మార్కెట్లో సందడి నెలకొంది. వందల సంఖ్యలో రాఖీ విక్రయాలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మా దివ్యాంగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ రాఖీలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మా దివ్యాంగ్ సొసైటీ వ్యవస్థాపకురాలు పోశవ్వ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ రాఖీల (పర్యావరణ పరిరక్షణ)ను తయారు చేసి విక్రయిస్తున్నారు. దీంతో ఈ రాఖీలు ఉపాధితో పాటు పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వీటిని ఆవుపేడ,మూడు రకాల ప్రకృతి సహజమైన సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. రాఖీలను ఉపయోగించిన తరువాత పడేయకుండా మొక్కలకు ఎరువులాగా,యాంటీ వైరల్,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌గా పని చేస్తుంది.నీటిని శుద్ధి చేయడానికి,చల్లదనాన్ని ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రజలకు ప్రముఖుల రక్షాబంధన్ శుభాకాంక్షలు
కమ్మర్పల్లి/ఇందూరు/బీర్కూర్, ఆగస్టు 11: రాష్ట్ర ప్రజలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. పండుగను అందరూ ఆనందోత్సహాలతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షాబంధన్ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములై జాతీయ స్ఫూర్తిని చాటాలని కోరారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ నారాయణరెడ్డి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.