కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీలు, ధర్నాలలు నిర్వహించారు. నూతన విద్యుత్ చట్టం తెస్తే కేంద్ర మంత్రులు, నాయకుల ఇండ్లకు పవర్ కట్ చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
-కామారెడ్డి/ ఇందూరు,ఆగస్టు 8
కామారెడ్డి / ఇందూరు, ఆగస్టు 8 : విద్యుత్ సవరణ బిల్లుకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పవర్‌హౌస్ ఆవరణలో, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎస్ఈ కార్యాలయం వద్ద టీఎస్పీ ఈజేఏసీ (తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యా క్షన్ కమిటీ) ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులు ప్లకార్డులు చేతబూని మోదీ డౌన్ డౌన్ అంటూ నిరసనలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో చేపట్టిన ధర్నాలో టీఎస్పీ ఈజేఏసీ చైర్మన్ రఘునందన్ మాట్లాడుతూ ..కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నదని, సవరణ చట్టం తెస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కేంద్రం మెడలు వంచే వరకు తగ్గేదే లేదన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకుంటే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఒకవేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతామని అన్నారు. ఇందుకు వినియోగదారులు సహకరించాలని కోరారు. వినియోగదారుల కోసం కేవలం విద్యుత్ సరఫరా జరిగే సబ్స్టేషన్లలో మాత్రమే ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని మిగిలిన అన్ని విభాగాలు మహాధర్నాలో పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఏడీలు తోట రాజశేఖర్, అశోక్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అడిషనల్ సెక్రటరీ జనరల్ బాబా శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.
సంస్కరణల పేరుతో ప్రైవేట్ రంగానికి..
కామారెడ్డిలో నిర్వహించిన ధర్నాలో విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ బి.బ్రహ్మం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేట్‌వారి చేతుల్లోకి వెళ్తుందన్నారు. వ్యవసాయానికి బిల్లుల వసూలు పేరుతో కొత్త మీటర్లు పెట్టే కుట్రలకు పాల్పడుతున్నదని ఆరోపిం చారు. సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ప్రైవేట్ పరం చేసే అవకాశం ఉందన్నారు. రాష్ర్టాల పరిధి నుంచి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ను రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా హెడ్ క్వార్టర్స్, జిల్లా కేంద్రాలు, సబ్స్టేషన్ల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలిపినట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యుత్ జేఏసీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ ఎడ్ల సంపత్‌రెడ్డి, కో -కన్వీనర్ గౌస్, జిల్లా నాయకులు శ్రీనివాస్, ఎన్ శ్రీరాములు, శ్రీనివాస్ రెడ్డి, బీఎన్ శ్రీనివాస్, లింగం, రమేశ్ గౌడ్, కృష్ణంరాజు పాల్గొన్నారు.
మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు
విద్యుత్ ఉద్యోగుల మహాధర్నాకు టీఆర్ఎస్ పట్టణ నాయకులు మద్దతు తెలిపారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకం టి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని దివాలా తీయించేలా ఉన్నాయని విమర్శించారు. ఏఎంసీ వైస్ చైర్మన్ కుంబాల రవియాదవ్ పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, అధికారప్రతినిధి ధాత్రిక సత్యం, నాయకులు గోనె శ్రీనివాస్, ఐరేని సందీప్, గణేశ్, సీఐటీయూ నాయకులు చంద్రశేఖర్ సంఘీభావం ప్రకటించారు.
బిల్లు ప్రవేశపెడితే ఊరుకునేది లేదు..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే ఊరుకునేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మద్దతు తెలుపుతున్నది. విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో విద్యుత్ ఉద్యోగులకు నష్టమే కాకుండారైతులు, చిన్న పరిశ్రమలు, వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేంద్ర వైఖరి మారకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
– బాలేశ్ కుమార్, జేఏసీ కన్వీనర్, నిజామాబాద్
కేంద్రానికి మా సత్తా చూపిస్తాం
కేంద్రం నడ్డి విరిచి, విద్యుత్ ఉద్యోగుల సత్తా చూపిస్తాం. వినియోగదారుల కోసం అహర్నిశలు పని చేస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదు. మోదీ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులతో పెట్టుకుంటే మాడిమసైపోవడం ఖాయం.
– మహ్మద్ ముక్తార్, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు