నిజామాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రైవేటు ఉద్యోగిగా పని చేసే ప్రదీప్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నెలంతా కష్టపడితే కానీ పూట గడవని స్థితి. ఇంటికి రాగానే తండ్రి ఫోన్‌తో పిల్లలు ఆడుకోవడం అలవాటు. ఓ రోజు ఫోన్‌కు వచ్చిన పనికి రాని లింక్‌ను తెలియక పిల్లలు టచ్ చేశారు. నిమిషాల్లో రూ.10 వేలు అకౌంట్లో జమ అవుతున్నట్లుగా మెస్సేజ్ వచ్చింది. కొద్దిసేపటికి పిల్లల నుంచి ఫోన్ తీసుకున్న ప్రదీప్‌కు అర్థం కాలేదు. అవతలి వైపు అమాయకులను బుట్టలో వేసుకునే ముఠాలు రంగంలోకి దిగి సదరు వ్యక్తిని ట్రాప్ చేశాయి. అంతే రూ.10 వేలకు 30-40 శాతం వడ్డీతో నెల తిరగకుండానే తిరిగి చెల్లించాలని ఫోన్లు రావడం మొదలైంది. రోజుకు పదుల సంఖ్యలో కాల్స్ వస్తుండడంతో మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. అయితే, అప్పటికే యాప్ నిర్వాహకులు మొబైల్ నుంచి దొంగిలించిన కాల్ డేటా ఆధారంగా సన్నిహితులకు, బంధువులకు ఫోన్లు చేసి వేధించడం మొదలు పెట్టారు. వారి తిట్లు తినలేక ప్రదీప్ ముఠా అడిగినంతా చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ ఆధారంగా దోపిడీకి తెర
సూక్ష్మరుణ సంస్థలు(మైక్రో ఫైనాన్స్) రుణ యాప్‌ల ముసుగులో అంతర్రాష్ట్ర ముఠాలు ఇంటర్నెట్ ఆధారంగా దోపిడీకి తెర లేపాయి. సాధారణంగా రుణాలు ఇచ్చేందుకు నెలకొల్పే సంస్థలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. లేని పక్షంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. రుణ యాప్‌లేవీ ఇలా చేయడం లేదు. ఎన్‌బీఎఫ్‌సీతో ఒప్పందం చేసుకున్న మరో సంస్థకు అవసరమైన సేవలు అందిస్తామని మాత్రమే చెబుతూ అగ్రిమెంట్ కుదుర్చుంటున్నాయి. ఆ ప్రకారం ఈ యాప్‌లు వాస్తవానికి రుణాలివ్వకూడదు. కానీ, నేరుగా వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలను నంజుకు తింటున్నాయి. డబ్బు చెల్లించక పోతే బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. ఏడాది క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు బాధ్యతలను సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా రుణ యాప్‌లపై ఉక్కుపాదం మోపడంతో కాసింత తగ్గుముఖం పట్టినట్లే కనిపించింది. కానీ, మళ్లీ ఈ వ్యవహారం అక్కడక్కడ వెలుగు చూస్తున్నది. చాలా మందికి ఎస్ఎంఎస్ రూపంలో సందేశాలు రావడంతో కంగు తింటున్నారు. టెలీ కాలర్స్ ఎక్కడి నుంచి మాట్లాడేది బయటికి తెలియకుండా యాప్స్ ద్వారా స్కూప్ కాల్స్ చేస్తూ రుణ గ్రహీతలను బెదిరిస్తుండడం గమనార్హం.
బూతులు తిడుతూ..
ఇన్‌స్టంట్‌గా చిన్న చిన్న రుణాలు తీసుకున్న పాపానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. యాప్ నిర్వాహకుల ఆగడాలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. చిన్న రుణానికే చనిపోవాలా అనే సందేహం అందరికీ వస్తుంది. అయితే, అసలు విషయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీని కోసం రుణ యాప్‌ల నిర్వాహకులు తమ కాల్ సెంటర్లో పని చేసే వారికి ముందుగానే శిక్షణ, అవగాహన కల్పిస్తూ బూతులను ఘోరంగా ఉపయోగిస్తున్నారు. యువతులతో హిందీ, ఇంగ్లిష్‌లో తిట్టించి మానసికంగా హింసిస్తున్నారు. అంతేకాకుండా రుణగ్రహీతల సన్నిహితులకు సైతం బెదిరింపులు వెళ్తున్నాయి. తీసుకున్న అప్పుతో పాటు చక్రవడ్డీని వసూలు చేయాలని సూచిస్తున్నారు. దీంతో ఎగ్జిక్యూటివ్‌లు రెచ్చిపోతూ బూతులను తీవ్ర స్థాయిలో ఉపయోగిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు ఈ రకమైన నేరాల్లో పాత్రధారులుగా నిలుస్తున్నారు. పేరుకు లీగల్ దందాగా చిత్రీకరిస్తున్నప్పటికీ ఇవన్నీ అక్రమంగా జరుగుతున్నవే. కొంత మంది లోన్ మంజూరు సమయంలో ఏది పడితే అది ఫోన్లో ఓకేలు కొట్టేస్తుండడం కొంప ముంచుతున్నది. మనకు తెలియకుండానే సదరు యాప్ ద్వారా మన ఫోన్లోని డేటాను తస్కరిస్తున్నారు. కాల్ డేటా, ఫొటోలను ఉపయోగించుకుని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు.
ఇచ్చేది గోరంతా.. తీసుకునేది కొండంత
లోన్ యాప్ ద్వారా ఆఫర్ ఇచ్చే డబ్బు కొద్ది మొత్తంలోనే ఉంటుంది. కేవలం రూ.10 వేలతో నేరగాళ్లు విసిరే వలకు చాలా మంది గ్రామీణ ప్రాంత యువత చిక్కుకుంటున్నది. డబ్బులైతే జమ కానీ అన్న ధోరణిలో తొలుత ఉత్సాహం చూపించి తర్వాత నిండా మునిగి పోతున్నారు. సమయానికి తిరిగి పేమెంట్ కట్టకపోతే పరువు తీసి బజారుకు ఈడుస్తున్న క్రమంలో ఏమి చేయాలో తెలియక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి బాధితులను బూతులు తిట్టినా, అవమాన పర్చే విధంగా మెస్సేజ్‌లు పెట్టినా, ఫోన్లు చేసినా వారిపై ఐపీసీ 506తో పాటు ఐటీ యాక్టు 66 కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సెక్షన్లలో నేరం రుజువైతే మూడు నుంచి ఐదేండ్ల వరకు జైలు తప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే, పరువు పోతుందనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. దీంతో పోలీసులు ఏం చేయలేక పోతున్నారు.
మాయగాళ్ల చేతిలో మోసపోవద్దు..
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. సాంకేతికత రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో మొబైల్ వాడకంపై పట్టు సాధించాలి. అంతే కాకుండా ఆర్థిక పరమైన యాప్‌లు ఇన్స్టాల్ చేసుకునే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మాయగాళ్లు విసిరే ఆఫర్లకు లొంగిపోతే వారు నిండా ముంచుతారు. అప్రమత్తంగా ఉండాలి. యాప్ నిర్వాహకుల వేధింపులపై పోలీసులను సంప్రదించాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం.
– వెంకటేశ్వర్, ఏసీపీ, నిజామాబాద్