నిజామాబాద్, జూలై 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశ ప్రజలకు భారీ మేలు చేస్తున్నట్లు పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అన్ని వర్గాలపై పన్నుల భారం మోపుతున్నది. జీఎస్టీ పోటుతో చిన్న పిల్లలను సైతం వదలడంలేదు.కనికరం లేకుండా ఎడాపెడా పన్నుల భారం మోపుతున్నది. సవరించిన జీఎస్టీ పన్ను రేట్లలో చేర్చిన పలు వస్తువులు, ఆహార పదార్థాల జాబితాలో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. స్కూల్ పిల్లల చదువు కోసం వినియోగించే పెన్సిల్, రబ్బర్లపైనా మోదీ సర్కారు పన్ను పోటును విధిస్తున్నది.
ప్రస్తుతం బల్క్‌గా 10 రబ్బర్లు రూ.20కి లభిస్తుండగా ఇకపై 18శాతం జీఎస్టీ చెల్లించిన తర్వాతనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడనున్నది. ఇప్పుడున్న ధరకు రూ.3.60 చొప్పున అదనపు భారం ప్రజలపై పడనున్నది. దీంతో 10 రబ్బర్లను ఇకపై కొనుగోలు చేయాలంటే రూ.23.60 చెల్లించాల్సి ఉంటుంది. ఇంతేకాదు అచ్చంగా పెన్సిల్, డ్రాయింగ్, రైటింగ్, ప్రింటింగ్ ఇంక్లపైనా భారీగా పన్నులు విధించడంతో వీటి వినియోగం భారంగా మారబోతున్నది. నర్సరీ పిల్లల నుంచి పీహెచ్డీ చదివే వారందరిపైనా ఈ పన్ను పోటు ప్రభావం చూపనున్నది.
విద్యాహక్కుకు తూట్లు…
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు జరిగిన లాభం కన్నా నష్టాలే ఎక్కువ. 2002లో వాజ్‌పేయి నేతృత్వంలోని సర్కారు ఏకంగా 86వ రాజ్యాంగ సవరణ చేసింది. తద్వారా 21(ఏ) ప్రకరణను రాజ్యాంగంలో చేర్చడం ద్వారా 6-14 ఏండ్ల బాలలకు బలవంతంగా విద్యను అందించాలని పేర్కొంది. 2010, ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. ఆయా రాష్ర్టాల్లో ఈ చట్టం అమలవుతున్నది. 2014లో అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ మాత్రం దేశంలో విద్యా హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.
జాతీయ విద్యా విధానం ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థను కుప్పకూల్చారు. శాస్త్ర, సాంకేతిక, వైద్య విద్యను అందిపుచ్చుకోలేక చాలా మంది మనదేశ పౌరులు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి దుస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొనగా.. తాజాగా తన నైజాన్ని నరేంద్ర మోదీ మళ్లీ నిరూపించుకున్నారు. ఏకంగా పెన్సిళ్లు, రబ్బర్లు, అట్లాస్, గ్లోబ్ వంటి విద్యాభ్యాసానికి, వైజ్ఞానిక విద్యను సముపార్జించే వస్తువులపై పన్ను విధించడం ద్వారా బీజేపీ సర్కారు ఉద్దేశం ప్రస్ఫుటమైంది. ఏకంగా జీఎస్టీ గరిష్ఠ స్లాబుల్లో చేర్చడంతో చిన్నపాటి ఉపకరణాలు కొనలేని దుస్థితి ఏర్పడనున్నది.
18శాతం పన్ను పోటా..?
ప్రింటింగ్, రైటింగ్ లేదా డ్రాయింగ్ ఇంక్, ఎల్ఈడీ బల్బులు, లైట్లు, వాటి మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కటింగ్ బ్లేడ్స్‌తో కూడిన నైఫ్స్, పేపర్ నైఫ్స్, పెన్సి ల్, షార్ప్నర్స్, బ్లేడ్స్, స్పూన్స్, ఫోర్క్, కేక్ సర్వర్లు, సబ్ మెర్సిబుల్ పంపులు ఇలా వందలాది వస్తువులపై 18శాతం పన్నును విధించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలకు అనుగుణంగా బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల పెత్తనంతో కొనసాగుతున్న జీఎస్టీ మండలిలో ఆమోదం తెలుపడం తో అనేక వస్తువులపై జీఎస్టీ పెను భారమై కూర్చున్న ది. ఇవే కాకుండా మ్యాప్‌లు, అట్లాస్ లు, గ్లోబ్స్పై 12శాతం జీఎస్టీని విధిం చి మోదీ సర్కారు రికార్డు సృష్టించింది.
స్కూల్ గోడలపై, వైజ్ఞానిక సదస్సులు, సమావేశాల్లో ప్రదర్శించే చిత్రపటాలపైనా ప్రతాపం చూపడం విడ్డూరంగా మారింది. సర్వే ఆఫ్ ఇండియా రూ పొందించిన మ్యాప్‌లను పలు ప్రైవేటు సంస్థలు తీర్చిదిద్ది మార్కెట్లో విక్రయిస్తుంటాయి. ఇకపై వీటికి 12 శాతం జీఎస్టీ చెల్లిస్తే తప్ప చేతికి రాని దుస్థితి ఏర్పడడంతో చాలా మంది కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కేసీఆరే ప్రత్యామ్నాయం…
ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా కేవలం ఎనిమిదేండ్లలో ప్రపంచ చిత్రపటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి. ఎలాంటి కొలమానాన్ని పెట్టి చూసినా దేశంలో తెలంగాణే నంబర్‌వన్ స్థానంలో కనిపిస్తుంది. అందుకే ప్రస్తుతం యావత్దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశానికి కావాల్సిన ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రజలే మూలం. అలాంటి ప్రజాభీష్టానికి అనువైన ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించి ముందుకు సాగాలని, దేశానికి ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ అడుగడుగునా చూస్తున్నది.
మరోవైపు ప్రతిపక్ష పాత్రను కూడా సరిగా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతున్నది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు దేశం ప్రత్యామ్నాయ పార్టీ కోసమో, ప్రభుత్వం కోసమో కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ఎదురు చూస్తున్నది. అలాంటి ఎజెండా ఆవశ్యకతను వెల్లడించినందునే ప్రస్తుతం సీఎం కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా స్వాగతాలు దక్కుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఓ రకంగా, ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న చోట మరో విధంగా వివక్షను ప్రదర్శిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోన్న మోదీని ఇంటికి పంపించాలనే డిమాండ్ పెరుగుతున్నది. జీఎస్టీ పేరుతో దేశ ప్రజలను చిత్ర హింసలకు గురిచేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచన ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
విద్యను దూరం చేసేందుకే..
పెన్సిళ్ల్లు, రబ్బర్లు, అట్లాస్‌తో పాటు వైజ్ఞానిక వస్తువులకు సైతం పన్ను వేయడం సరి కాదు. దీని కారణంగా రాబోయే రోజుల్లో విద్య సామాన్యులకు దూరమయ్యే అవకాశాలున్నాయి. దీనికితోడు భారం కూడా పెరిగే ప్రమాదం ఉన్నది. ఈ నిర్ణయాన్ని వెంటనే కేంద్రం విరమించుకోవాలి.
-లింగాల అమూల్య, ఆచన్‌పల్లి
దోచుకోవడమే కేంద్రం ప్రభుత్వ ధ్యేయం
శక్కర్‌నగర్, జూలై 21 : దోచు కోవడమే ధ్యేయంగా కేంద్ర ప్ర భుత్వం, ప్రధాని మోదీ పని చే స్తున్నారు. సామాన్యుల జీవితా లు దుర్భరంగా మార్చే చర్యలకు మోదీ కంకణం కట్టుకున్నారు. విద్య,వైద్యం ఉచితంగా అంది చాల్సి ఉండగా, విద్యను సైతం దూరం చేసే విధంగా జీఎస్టీలో విద్యకు సంబంధించిన చిన్నపాటి వస్తు వుల పై పన్నువిధించే చర్యలకు పాల్పడడం శోచనీయం.
-గుమ్ముల గంగాధర్, ఏఐకేఎంఎస్ నాయకుడు
భారంగా మారనున్న విద్య
కేంద్రం చేపడుతున్న చర్యలు నిత్యం టీవీల్లో చూస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యాభ్యాసం ఎంత భారంగా మారుతుందో అర్థం కావడం లేదు. జీఎస్టీ నుంచి విద్యారంగానికి చెందిన వస్తువులను మినహాయించాలి. కేంద్రం అనాలోచిత నిర్ణయాలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
-చేపూర్ సంధ్య, జంలం, ఎడపల్లి మండలం
ఇక మిగిలింది మరుగుదొడ్లే..
కేంద్రం అనాలోచిత చర్యలు సామాన్యుల నడ్డివిరుస్తున్నా యి. ఇప్పటికే చేసిన పనులు సా మాన్యుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ రంగాలకు అప్పగిస్తూ, రోజుకో వేటు వేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోంది.
-జునైద్ అహ్మద్ ఖలీల్, బోధన్.