నిజామాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని సగటు మనిషి బతకడం కష్టంగా మారింది. గాలి పీల్చుకోవడం మినహాయిస్తే దేశంలో జీఎస్టీ రూపంలో ప్రతి దానికి పన్నులు విధించి ప్రజల ను బతకనీయకుండా చేస్తున్నాడు. ఎనిమిదేండ్ల బీజేపీ ఏలుబ డిలో బతుకు బండి నడవడం కష్టంగా మారింది. కార్పొరేట్ వ్యక్తుల ఆదాయాన్ని బిలియన్లలో పెంచేందుకు దోహదం చేస్తున్న బీజేపీ నిర్ణయాలు… సామాన్యుడికి శరాఘాతంగా మారుతున్నాయి. వస్తు సేవల పన్ను – జీఎస్టీని తీసుకు వచ్చి సరిగ్గా ఐదేండ్లు పూర్తయ్యింది.
జనానికి ఊరటను కలిగించే పన్నుల విధానం అంటూ గొప్పలు చెప్పిన మోదీ సర్కారే ఏకంగా పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థాలపైనా 5శాతం పన్నులు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టానుసారంగా పెంచేసి నిత్యావసర ధరలను పెంపునకు కారణమైన కేంద్ర ప్రభుత్వమే మరోమారు జీఎస్టీ రూపంలో కిరాయి ఇండ్లు, కొబ్బరి నీళ్లపైనా పన్నులు బాదడం ఏమిటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మోదీ ప్రజావ్యతిరేక విధా నాలతో నెలవారీ జీతం డబ్బులు సైతం కుటుంబ పోషణకు సరిపోని దుస్థితి ఏర్పడుతుండడం విచారంగా మారింది. అందుకే జనమంతా ఎక్కడ చూసినా చంపకు మోదీ అంటూ ఆయన ఫొటోకు దండం పెడుతున్నారు.
దుర్భరంగా పేదల జీవితాలు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తీసుకువచ్చిన గూడ్స్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) వెనుకాల దాగి ఉన్న ఉద్దేశం ఏమిటన్నది దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది. బియ్యం, తృణ ధాన్యాలు, పప్పులు, పాలు, పెరుగు, రొట్టెల పిండి వంటి సామాన్యులు ప్రతి రోజూ వాడే ఆహార పదార్థాలపై కూడా పన్ను భారం వేస్తున్నారు. చెంచాలు, గంటెలను కూడా వదలకుండా పన్నులు వడ్డించడం మోదీ ప్రభుత్వ స్వభావాన్ని వెల్లడిస్తున్నది. జీఎస్టీ ప్రవేశ పెట్టి ఐదేండ్లవుతున్నది. ఈ ఐదేండ్లలో కార్పొరేట్ సంస్థల పన్నులు తగ్గాయి. ప్రజలపై మాత్రం పన్నుల భారం విపరీతంగా పెరిగింది. దీంతో దేశంలో పేదల జీవనం దుర్భరంగా మారుతున్నది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడి, నిత్యావసర ధరలు పెరిగి, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల బతుకు భారంగా మారింది.
బతకాలా? వద్దా?
సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడిపే బీజేపీపై జనమంతా విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో ఇప్పటికే సగటు మధ్య తరగతి జీవి కుదేలయ్యాడు. తాజా గా ఏమి తినాలన్నా? ఏమి తాగాలన్నా? జీఎస్టీ చెల్లించిన తర్వాతే అన్నట్లుగా పరిస్థితి దాపురించడంపై జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. నిత్యం మోదీ చిత్ర పటాలతో గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలకు వ్యతిరేకత తప్పడం లేదు. సోషల్ మీడియాలోనైతే కేంద్ర సర్కారు, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను లక్ష్యంగా చేసుకుని ‘బైబై మోదీ’ అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు వదులుతున్న సెటైర్లకు బీజేపీ నేతలు ఏకంగా తలలు పట్టుకుంటున్నారు.
రైతులపై పెనుభారం…
ఐదేండ్ల క్రితం అమల్లోకి వచ్చిన జీఎస్టీతో సామాన్యులకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ ప్రకటించారు. ధాన్యాలు, పెరు గు, లస్సీ వంటి వాటన్నింటికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు జీఎస్టీ నుంచి దేన్నీ వదల్లేదు. చింతపండు, చక్కెర, వంట నూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితికి తీసుకొచ్చారు. పసి పిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించకుండా పాలు, పెరుగు,లస్సీ, బటర్ మిల్క్ వంటి వాటిపైనా 5శాతం జీఎస్టీ విధిస్తుండడం అమానవీయం అంటూ జనం మండిపడుతున్నారు. పాడి పరిశ్రమను దెబ్బ తీసే విధంగా జీఎస్టీ సంస్కరణలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పశువుల దాణాపైనా జీఎస్టీ విధించిన బీజేపీ ప్రభుత్వమే డెయిరీ ఉత్పత్తుల మిషనరీలపై విధించే పన్నును 18శాతానికి చేర్చారు. చివరకు దవాఖానల్లో రోగులకు కేటాయించే పడకలపైనా జీఎస్టీ వసూలుకు కేంద్రం సిద్ధమైంది.
పాలు అమ్ముకునే పరిస్థితి ఉండదు..
బీర్కూర్ : కేంద్రలోని బీజేపీ తీరుతో పాలు అమ్ముకునే పరిస్థితి కూడా పాడి రైతులకు లేకుండా పోతు న్నది. ఎన్నో ఏండ్ల నుంచి పాలను అమ్ముకుని బతుకుతున్నాం. కేం ద్రం తీసుకున్న నిర్ణయంతో మా లాంటి కుటుంబాలు ఎన్నో రోడ్డు న పడే అవకాశం ఉంది. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్ర భుత్వం పునరాలోచన చేయాలి లేదంటే పాడి రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు..
-మురళి, పాడిరైతు, బీర్కూర్
పాలు, పెరుగు, మజ్జిగలపై పన్ను విధించడం శోచనీయం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నో ప్రభుత్వాలను చూస్తున్నాం కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని జీవితంలో చూడలేదు. ఇకపై చూడబోను కూడా. పాడి పశువులను నమ్ముకొని పాలు, పెరుగు, మజ్జిగ అమ్ముకొని బతుకుదామంటే జీఎస్టీ విధించడం మాఖర్మ. దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి.
-చింత రాంబాబు, పాడి రైతు, బీర్కూర్