నిజామాబాద్ క్రైం, జూలై 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించి ఊర పండుగకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీపీ నాగరాజు ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అడిషనల్ డీసీపీ అరవింద్‌బాబు పర్యవేక్షణలో ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో మొత్తం 500 మంది బందోబస్తులో పాల్గొన్నారు. ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. దేవతా మూర్తుల ఊరేగింపు ప్రారంభం నుంచి చివరి వరకు వీడియో చిత్రీకరించారు. అల్లరి మూకలను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, సీఐలు కృష్ణ, నరేశ్, ఎస్సైలు పూర్ణేశ్వర్, సాయినాథ్, సందీప్, లింబాద్రి, మహేశ్, రాము, జ్ఞాన్‌సింగ్ బందోబస్త్‌లో పాల్గొన్నారు. 15 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలతోపాటు సివిల్, స్పెషల్ పార్టీ బలగాలు, మహిళా సిబ్బంది, హోంగార్డులు విధులు నిర్వహించారు.
పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపు..
గ్రామ దేవతల ఊరేగింపు కొనసాగే ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు, సిబ్బందితో కలిసి వాహనాలను దారి మళ్లించారు. వర్నిరోడ్డు చౌరస్తా నుంచి గాజుల్పేట్ మీదుగా వెళ్లాల్సిన వాహనాలను పవర్ హౌజ్ నుంచి హైదరాబాద్ రోడ్డు వైపు మళ్లించారు. న్యాల్కల్ చౌరస్తా వైపు నుంచి పెద్దబజార్ మీదుగా వెళ్లే వాహనాలను కోటగల్లీ మీదుగా మళ్లించారు. పూలాంగ్ మీదుగా గోల్హనుమాన్ వైపు వచ్చే వాహనాలను హైదరాబాద్ రోడ్డు నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తా, ఖలీల్‌వాడి మీదుగా దారి మళ్లించారు.