విద్యానగర్, జూలై 17 : మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెండింగ్‌లో లేకుండా రెగ్యులర్‌గా ఆస్తిపన్ను కట్టే వారికి రాయితీ కల్పిస్తున్నది. ఆస్తి పన్ను వసూలు చేసి పట్టణ అభివృద్ధికి నిధులను వినియోగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నుతోపాటు గతంలోని బకాయిలను చెల్లిస్తే వన్‌టైం సెటిల్ మెంట్ స్కీం (ఓటీఎస్) కింద 90శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. బకాయిలకు సంబంధించి అసలును ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీలోగా చెల్లిస్తే 90 శాతం వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామారెడ్డి జిల్లా పరిధిలో మూడు మున్సిపాలిటీలు.. కామారెడ్డి పట్టణంతోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల అధికారయంత్రాంగం పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. కామారెడ్డి పట్టణంలో రూ.7 కోట్ల 10 లక్షలకుగాను ఇప్పటి వరకు రూ.2 కోట్ల 87 లక్షలు వసూలైంది. మరో రూ.4 కోట్ల 23 లక్షలు వసూలు కావాల్సి ఉంది. వందశాతం పన్ను వసూలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఏండ్లుగా ఆస్తి పన్ను బకాయి ఉన్నవారు వడ్డీ రాయితీ కోసం వన్ టైం సెటిల్మెట్ స్కీం(ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకుంటే మున్సిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
పన్ను వసూళ్లపై విసృత ప్రచారం
గతంలో 5 శాతం రిబేట్ ఉన్న సమయంలో మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు 90 శాతం రాయితీ ఇవ్వాని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు, సిబ్బంది, బిల్ కలెక్టర్లు పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. ప్రత్యక్షంగా లేదా ఆన్లైన్లో పన్ను చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేసే దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.
వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం స్కీమ్‌ను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 90 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనుండడం మంచి అవకాశం. అక్టోబర్ 31 వ తేదీలోగా పన్ను బకాయిలు చెల్లించే వారికి వడ్డీ రాయితీ వర్తిస్తుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-దేవేందర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్