నవీపేట,జూలై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు వేల ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని యంచ, అల్జాపూర్, బినోలా, నారాయణపూర్, జన్నేపల్లి, లింగాపూర్, నిజాంపూర్, నాళేశ్వర్ గ్రామాలతోపాటు తదితర గ్రామాల్లో నష్టపోయిన పంటలపై సర్వే చేసి నివేదికను తయారు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే పంట నష్టం నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని ఏవో తెలిపారు.
40 ఇండ్ల నివేదికను అందజేశాం..
లింగాపూర్, యంచ, నవీపేట, నిజాంపూర్, నవీపేట తదితర గ్రామాల్లో 40 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఆయా గ్రామాల్లో పర్యటించి కూలిన ఇండ్లపై సర్వే నివేదికను ప్రభుత్వానికి అందచేసినట్లు తహసీల్దార్ వీర్‌సింగ్ పేర్కొన్నారు. త్వరలో పరిహారం మంజూరవుతుందని ఆయన అన్నారు.
జన్నేపల్లి మాటు కాల్వ మరమ్మతుకు ప్రతిపాదన
భారీ వర్షాలకు గండ్లు పడిన మాటు కాలువలు తాత్కాలిక మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ బాల్‌రాం తెలిపారు. జన్నేపల్లి మాటు కాల్వకు సిరన్‌పల్లి, లింగాపూర్ శివారులోని తుంగినీ వద్ద గండ్లు పడి ధ్వంసమైందని పేర్కొన్నారు. నాళేశ్వర్ మాటు కాలువ మరమతులకు రూ.20 లక్షల వ్యయంతో నివేదిక తయారు చేసి పంపించినట్లు చెప్పారు. జన్నేపల్లి, నాళేశ్వర్ మాటు కాలువలకు శాశ్వత మరమ్మతుల కోసం రూ.20 కోట్లతో ప్రతిపాధనలు తయారు చేసే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే షకీల్‌కు సైతం విన్నవించినట్లు తెలిపారు.
ధ్వంసమైన రోడ్ల నివేదిక సిద్ధం
వర్షాలకు ధ్వంసమైన రోడ్ల నివేదికలను తయారు చేస్తున్నట్లు పీఆర్ ఏఈ శ్రావణ్‌కుమార్ తెలిపారు. అబ్బాపూర్(బీ) రోడ్డుతోపాటు నాళేశ్వర్, బినోలా, తుంగినీ, నందిగామ తదితర గ్రామాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. ధ్వంసమైన రోడ్ల మరమ్మతుకు నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు.